Breaking News

అతడితో బిల్‌గేట్స్ సాన్నిహిత్యమే విడాకులకు కారణం.. వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం


మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ దంపతులు విడిపోతున్నట్టు చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అయితే, ఇది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. బిల్ గేట్స్ నుంచి విడిపోవాలని మిలిండా గేట్స్‌ 2019లోనే తీసుకున్నారా? అప్పటి నుంచే ఆమె విడాకుల న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారా? అంటే.. అవుననే ఆ కథనం అంటోంది. లైంగిక నేరాల్లో దోషిగా తేలి, పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో బిల్‌గేట్స్‌ సంబంధాలే అందుకు కారణమని వాల్ స్ట్రీట్ కథనం పేర్కొంది. మైనర్‌ బాలికలపై లైంగిక వేధింపులు, మహిళల అక్రమ రవాణా లాంటి కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎప్‌స్టీన్‌‌కు శిక్ష కూడా పడింది. అతడు జైలు శిక్ష అనుభవిస్తూ 2019 ఆగస్టులోనే మరణించాడు. లైంగిక నేరాలకు పాల్పడి దోషిగా తేలిన వ్యక్తితో బిల్‌గేట్స్‌ సన్నిహితంగా మెలగడంపై మిలిండా అభ్యంతరం తెలిపారు. అయితే ఎప్‌స్టీన్‌తో తాను ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే చర్చిస్తున్నానని బిల్‌గేట్స్‌ 2013లో ఈ ప్రచారంపై వివరణ ఇచ్చారు. 2011 నుంచి ఎప్‌స్టీన్‌ను బిల్‌గేట్స్‌ తరుచూ కలుస్తూనే ఉన్నారు. ఒకసారి ఎప్‌స్టీన్‌ ఇంటిలో రాత్రంతా గేట్స్‌ గడిపారని, ఈ నేపథ్యంలోనే మిలిండా విడాకుల నిర్ణయం తీసుకుందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. బిల్ మిలిండా గేట్స్ ఫౌండేషన్‌లో పనిచేసిన మాజీ ఉద్యోగి. ఎప్‌స్టీన్‌‌ను 2013లో గేట్స్ దంపతులు కలిసిన తర్వాత.. తాను అసౌకర్యానికి గురైనట్టు మిలిండా వెల్లడించారు. కానీ, ఆ తర్వాత కూడా బిల్‌తోపాటు సంస్థలో పనిచేసే ఉద్యోగులు జెఫ్రీతో సంబంధాలు కొనసాగించారు. ఎప్‌స్టీన్‌కు చెందిన మన్‌హట్టన్ టౌన్‌హౌస్‌లో బిల్‌గేట్స్ కనీసం మూడుసార్లు కలుసుకున్నారు.. ఒక రాత్రంతా అక్కడ గడిపారు. అయితే, ఎప్‌స్టీన్‌తో తనకు వ్యాపార, స్నేహసంబంధాలు లేవని వాల్ స్ట్రీట్ జర్నల్‌కు 2019లో ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ స్పష్టం చేశారు. ఇక, న్యూయార్క్ జైలులో ఉన్న ఎప్‌స్టీన్ మాజీ స్నేహితుడు ఘిస్లానీ మ్యాక్స్‌మెల్.. మహిళల అక్రమ రవాణా వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, తాను ఈ నేరానికి పాల్పడలేదని చెప్పారు. ఈ అంశం మరి కొద్ది రోజుల్లో విచారణకు రానుంది. ఎప్‌స్టీన్ బాలికలపై లైంగిక వేధింపులకు ఈ బ్రిటీష్ సామాజికవేత్త సహాయం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. బిల్‌ గేట్స్‌ దంపతులు తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు గతవారం ప్రకటించారు. తమ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు సోమవారం రాత్రి ట్విటర్‌ ద్వారా గేట్స్ ప్రకటించారు. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడిగానే కాకుండా బిల్-మిలిండా గేట్స్ ఫౌండేషన్‌ ఏర్పాటుచేసి ప్రపంచవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాల ద్వారా విశేష గుర్తింపు పొందిన ఈ జంట విడాకులు తీసుకోవడం అందర్నీ షాక్‌కు గురిచేసింది.


By May 11, 2021 at 07:51AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/microsoft-founder-bill-milenda-gates-divorce-talks-started-in-2019-on-epstein-link/articleshow/82539956.cms

No comments