Breaking News

మమ్మల్ని నమ్మండి.. ఆ వివరాలను ఇవ్వలేం: సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం


కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఎదురవుతున్న అనేక సవాళ్లను పరిష్కరించడంలో న్యాయమూర్తులకు నైపుణ్యం అంతంత మాత్రమేనని సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్రం, రాష్ట్రాలు కార్యనిర్వహక విభాగం, సంబంధిత నిపుణులతో సంప్రదించి కార్యాచరణ రూపొందిస్తాయని పేర్కొంది. శాస్త్రవేత్తలు, వైద్య నిపుణుల సలహాల మేరకే కొవిడ్‌ కట్టడి విధానాన్ని రూపొందించినందున ఇందులో న్యాయస్థానాల జోక్యానికి అవకాశమే లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు ఆదివారం రాత్రి సమర్పించిన అఫిడ్‌విట్‌లో పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులకు స్పందనగా శాస్త్రీయ దృక్పథంతో దీనిని తయారు చేసినట్టు తెలిపింది. ఈ విషయంలో కార్యనిర్వాహక వ్యవస్థ విజ్ఞతను విశ్వసించాలని కోరింది. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు కూడా ఉచితంగానే టీకాలు అందుతాయని పేర్కొంది. దేశంలోని కరోనా పరిస్థితులపై సుమోటోగా విచారణ జరుపుతున్న జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాససం ఈ అఫిడ్‌విట్‌ను పరిశీలించింది. న్యాయస్థానాలు సదుద్దేశంతో జోక్యం చేసుకున్నప్పటికీ అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఊహించని పరిణామాలు ఎదురుకావచ్చని తెలిపింది. ఆక్సిజన్ సరఫరా విషయంలో కోరిన వివరాలను అందజేయలేమని, ఈ అంశంపై నిర్ణయాన్ని ధర్మాసనం నేతృత్వంలోని జాతీయ టాస్క్‌ఫోర్స్‌కు వదిలివేయాలని కేంద్రం కోరింది. నేషనల్ టాస్క్‌ఫోర్స్‌ (ఎన్‌టీఎఫ్) లో వివిధ నగరాలకు చెందిన నిపుణులు ఉన్నారు. ‘‘ఎన్‌టీఎఫ్ విధివిధానాలు, నిబంధనలు, సూచనల దృష్ట్యా, రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా, ఉత్పత్తి, లభ్యత, సేకరణ, కేటాయింపు, రవాణా ప్రణాళికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఉత్తర్వులలో పేర్కొన్న అంశాలపై వివరణను కేంద్ర ప్రభుత్వం మర్యాదపూర్వకంగా తిరస్కరిస్తుంది.. రాష్ట్రాల ద్వారా ఆసుపత్రులకు సరఫరా చేసి కోవిడ్ -19 రోగులకు అందజేస్తున్నాం’’ అని కేంద్రం తెలిపింది కాగా, కేంద్రం గౌరవప్రదమైన పదజాలం వాడిగా సుప్రీంకోర్టు సుమోటాగా విచారణ చేపట్టంపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. 18-44 ఏళ్ల వారికి ఉచితంగా టీకాలు ఇస్తామని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయని పేర్కొంది. అందువల్ల ధరల ప్రభావం ప్రజలపై ఉండబోదని అభిప్రాయపడింది. టీకా తయారీ సంస్థలతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడిందని, అన్ని రాష్ట్రాలకూ ఒకే ధరకు అందించడానికి అంగీకరించాయని తెలిపింది. వైరస్‌కు గురయ్యే ప్రమాదం ఉన్న వర్గాలను గుర్తించి ప్రాధాన్య క్రమంలో టీకాలు ఇస్తున్నట్టు వివరించింది.


By May 11, 2021 at 08:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/centre-refuses-to-share-details-on-oxygen-supplies-with-supreme-court/articleshow/82540245.cms

No comments