Breaking News

గ్రామీణ, గిరిజ ప్రాంతాలకు కోవిడ్.. కట్టడికి మార్గదర్శకాలు జారీచేసిన కేంద్రం


దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి ఇప్పటి వరకూ నగరాలకే పరిమితం కాగా.. క్రమంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు ప్రభావితం కావడం పట్ల కేంద్రం ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాల్లో కొవిడ్ నియంత్రణకు తాజా సూచనలు చేసింది. ఈ మేరకు ఆదివారం కొత్తగా మార్గదర్శకాలను వెలువరించింది. కరోనా బాధితుల సేవలకు అవసరమైన మౌలికసౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. గ్రామీణ ప్రజల్లో తీవ్ర అనారోగ్యం, శ్వాస సమస్యలపై నిఘా ఉంచాలని సూచించింది. ఆశా, ఆరోగ్య కార్యకర్తలతో కరోనా పరిస్థితులను పర్యవేక్షించి, కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి టెలీమెడిసిన్ సేవలు అందించాలని సూచించింది. కరోనా రెండో దశలో దాదాపు 85 శాతం మందిలో స్వల్ప లక్షణాలు ఉంటున్నాయని కేంద్రం పేర్కొంది. స్వల్ప లక్షణాల ఉన్న బాధితులు ఇంటి వద్దే ఐసోలేషన్‌లో చికిత్స తీసుకోవాలని తెలిపింది. కరోనా రోగుల ఆక్సిజన్ స్థాయులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని, ఒకవేళ ఎవరికైనా తగ్గిపోతే తక్షణమే ఆస్పత్రులకు తరలించాలని నిర్దేశించింది. ర్యాపిడ్ యాంటీ టెస్ట్‌లపై ఏఎన్ఎం, సీహెచ్ఓలకు శిక్షణ ఇవ్వాలని, అన్ని ప్రజారోగ్య కేంద్రాల్లో కిట్లు, గ్రామాల్లో ఆక్సీమీటర్లు, థర్మామీటర్లు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. ఆక్సీమీటర్లు వాడిన ప్రతిసారి శానిటైజ్ చేయాలని పేర్కొంది. ఆశా, అంగన్ వాడీ, వాలంటీర్ల ద్వారా సేవలు అందించాలని తెలిపింది. కరోనా బాధితులందరికీ హోం ఐసోలేషన్ కిట్లు అందించాలని తన మార్గదర్శకాల్లో వివరించింది. ప్రతి గ్రామంలోనూ ఆశా కార్యకర్తల సాయంతో ఇన్‌ఫ్లూయోంజా వంటి వ్యాధులపై పర్యవేక్షణ ఉంచాలని సూచించింది. ఎవరికైనా కోవిడ్ నిర్ధారణ అయితే వారితో కాంటాక్ట్ అయినవారిని తక్షణమే గుర్తించి, పరీక్షలు నిర్వహించాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ‘హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు నిర్ధారణ అయినప్పటి నుంచి కనీసం 10 రోజులు బయటకు రాకుండా చూడాలి. పది రోజులయి వరుసగా మూడు రోజుల నుంచి జ్వరం లేనివారికి పరీక్షలు అవసరం లేదు’ అని తెలిపింది.


By May 16, 2021 at 03:32PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/centre-issues-new-guidelines-to-battle-covid-in-rural-parts-amid-surge/articleshow/82679075.cms

No comments