Breaking News

కరోనాతో కన్నుమూసిన రాహుల్ సన్నిహితుడు, కాంగ్రెస్ యువ ఎంపీ


కరోనా మహమ్మారి మరో ప్రజాప్రతినిధి బలయ్యాడు. మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతావ్ (46) ఆదివారం ఉదయం కన్నుమూశారు. కోవిడ్‌కు చికిత్స పొందుతూ ఆయన ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 22న రాజీవ్ సతావ్‌కు కోవిడ్ నిర్ధారణ కావడంతో చికిత్స కోసం పుణేలోని జహంగీర్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం రెండు రోజుల కిందటే ఆయన కోలుకున్నారు. అయితే, మళ్లీ ఆయనకు అనారోగ్యం తిరగబెట్టడంతో పరిస్థితి విషమించింది. దీంతో ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగించారు. రాజీవ్ సతావ్ ప్రాణాలను నిలబెట్టడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున ఆయన చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రాహుల్‌ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా రాజీవ్ సతావ్ గుర్తింపు పొందారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోనూ సభ్యుడిగా ఉన్నారు. 2014 ఎన్నికలలో మహారాష్ట్రలోని హింగోలి నుంచి ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం గుజరాత్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సతావ్ మరణంపై కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాజీవ్ మరణం తీవ్ర విచారకరమని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో పేర్కొంది. దేశం, పార్టీ కోసం అహర్నిశలూ పాటుపడ్డారని కొనియాడింది. యువజన కాంగ్రెస్‌లో నాతో పాటు తొలి అడుగులు వేసిన స్నేహితుడిని కోల్పోయాను అంటూ కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. ‘‘ఫ్రంట్‌లైన్ యోధుడు, సీడబ్ల్యూసీ సభ్యుడు, ఎంపీ, మంచి యువనేతను కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది.. రాజీవ్ మరణవార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది.. ఆయన అంకితభావం, అపారమైన ప్రజాదరణను పార్టీ ఎన్నటికీ మరిచిపోదు.. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ అని కేసీ వేణుగోపాల్ ట్విట్టర్‌లో అన్నారు.


By May 16, 2021 at 10:42AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-leader-mp-rajeev-satav-dies-after-covid-related-complications/articleshow/82675604.cms

No comments