Breaking News

తొలి ప్రయత్నంలో చరిత్ర సృష్టించిన చైనా.. మార్స్‌పై డ్రాగన్ రోవర్ ల్యాండింగ్!


అంగారకుడిపై అన్వేషణకు చైనా తొలిసారిగా చేపట్టిన ప్రయోగం విజయవంతమయ్యింది. తాము ప్రయోగించిన .. ఆంగారకుడి ఉపరితలంపై శనివారం తెల్లవారుజామున విజయవంతంగా దిగినట్టు చైనా అధికారిక మీడియా ప్రకటించింది. దీంతో అంతరిక్ష యాత్రలో చైనా మరో మైలురాయిని సొంతం చేసుకుంది. జురోంగ్ రోవర్‌ను మార్స్ వాతావరణంలోకి పారచూట్ సాయంతో ల్యాండర్ సాఫీగా దింపిందని, ప్రయోగంలో అత్యంత క్లిష్టమైన ఈ ప్రక్రియను నిరాటంకంగా సాగిందని తెలిపింది. ల్యాండింగ్‌లో కీలకమైన చివరి ఏడు నిమిషాలు ప్రక్రియ సజావుగా పూర్తయినట్టు పేర్కొంది. అరుణగ్రహంపై విస్తారమైన ఉత్తర లావా మైదాన ప్రాంతం ఉటోపియా ప్లానిటియా వద్ద జురోంగ్‌ను దింపారు. నిర్దేశిత ప్రాంతంలోనే రోవర్ విజయవంతంగా దిగినట్టు చైనా అధికారిక మీడియా సీసీటీవీ తెలిపింది. ఈ కార్యక్రమాన్ని ‘నిహావ్ మార్స్’ పేరిట ప్రత్యక్ష ప్రసారం చేసింది. అంగారక ఉపరితలంపై రోవర్ విజయవంతంగా దిగిన విషయాన్ని చైనా జాతీయ అంతరిక్ష యంత్రాంగం ధ్రువీకరించినట్టు జున్హూ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అంగారకుడిపై తొలి మిషన్‌‌లోనే ల్యాండింగ్, రోవింగ్ ఆపరేషన్ చేసిన మొదటి దేశంగా చైనాగా నిలిచింది. ఇప్పటివరకు అమెరికా, రష్యాలు మాత్రమే అంగారకుడిపై రోవర్లు పంపాయి. తాజాగా, వాటి సరసన చైనా చేరింది. చైనా తన వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపింది. చంద్రుడు, అంగారక గ్రహంపై పరిశోధనలకు రోవర్‌ను దింపింది. అంతరిక్ష ప్రయోగాల్లో ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అమెరికా ప్రయోగించిన ప్రిజర్వెన్స్ అంగారకుడిని చేరిన కొద్ది రోజుల్లోనే చైనా జురోంగ్ రోవర్ చేరుకుంది. ‘జురోంగ్’ అంటే చైనా పురాణాల ప్రకారం అగ్ని దేవుడు.. దాదాపు 240 కిలోల బరువున్న ఈ రోవర్.. సోలార్ విద్యుత్ సాయంతో పనిచేస్తుంది. అంగారకుడి ఉపరితలంపై శిలాజాలు, పలు నమూనాలను సేకరించనుంది. గత జులైలో స్పేస్ క్రాఫ్ట్ ద్వారా జురోంగ్‌ను చైనా ప్రయోగించగా.. ఏడు నెలల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించింది. మూడు నెలల పాటు అంగారకుడి చుట్టూ పరిభ్రమించిన తియాన్‌వెన్.. శుక్రవారం అనువైన ప్రదేశంలో రోవర్‌ను దింపింది. ఉపరితలంపై దిగే సమయంలో ఏడు నిమిషాలే అత్యంత కీలకమని చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఎందుకంటే సమాచారం పరిమితంగా ఉండి, రేడియో తరంగాలు అంగారక గ్రహం నుంచి భూమిని చేరుకోగల దానికంటే వేగంగా ఉంటాయి. గతంలో అమెరికా, రష్యా, ఐరోపా సమాఖ్య ల్యాండ్ రోవర్‌లు ఉపరితలంపై దిగే సమయంలో విఫలమయ్యాయి.


By May 15, 2021 at 09:38AM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/china-spacecraft-tianwen-1-successfully-touches-down-on-red-planet-makes-history/articleshow/82651073.cms

No comments