Breaking News

భారీగా భారత్ రకం స్ట్రెయిన్ కేసులు.. లాక్‌డౌన్ ఎత్తివేతపై UK PM కీలక ప్రకటన!


భారత్‌లో రెండో దశ వ్యాప్తికి కారణంగా భావిస్తున్న B1.617.2 వేరియంట్ ఇంగ్లాండులోనూ క్రమంగా వ్యాపిస్తోంది. భారత్ తర్వాత ఈ రకం వేరియంట్ కేసులు ఎక్కువగా అక్కడే నమోదయినట్టు డబ్ల్యూహెచ్ఓ నివేదిక సైతం పేర్కొంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ఆంక్షల సడలింపులపై బ్రిటన్ పునరాలోచనలో పడింది. భారత్‌లో వ్యాప్తికి కారణమైన కరోనా వేరియంట్ కేసుల పెరుగుదల బ్రిటన్ పునఃప్రారంభ ప్రణాళికలకు తీవ్రమైన విఘాతం కలిగించవచ్చని శుక్రవారం హెచ్చరించారు. ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ ఆంక్షలను జూన్ 21 నుంచి పూర్తిగా ఎత్తివేయాలని భావించినా.. దీనిపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. దీనిపై సోమవారం నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు ప్రధాని బోరిస్ జాన్సన్ సంకేతాలిచ్చారు. రోడ్ మ్యాప్‌ను ఆలస్యం చేయాల్సిన అవసరం ఉందని నేను నమ్మను.. కానీ, కొత్త వేరియంట్ మన అభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగిస్తుందన్నారు. అయితే, ప్రజలను సురక్షితంగా ఉంచడానికి మేము ఏదైనా చేస్తామని జాన్సన్ స్పష్టం చేశారు. ‘‘వాయువ్య ఇంగ్లాండులో మొదలైన B1.617.2 వేరియంట్ వ్యాప్తి అత్యంత వేగంగా పెరుగుతోంది.. లండన్‌లోనూ ఈ కేసులు ఉన్నాయి.. ఇది మరింత విజృంభించకుండా కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని బ్రిటన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు, 50 ఏళ్లు దాటినవారికి రెండో డోస్ టీకా ఇవ్వనున్నట్టు ప్రధాని తెలిపారు. ఈ రకం వేరియంట్ కేసులు అక్కడ ఒక వారంలోనే 520 నుంచి 1313కి పెరిగాయి. దీంతో టెస్టులను, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని యూకే నిర్ణయించింది. ఇతర స్ట్రెయిన్‌ల కంటే ఇది వేగంగా వ్యాప్తిచెందుతుందా? అనే సమాచారం కోసం వేచిచూస్తున్నామని.. పూర్తిస్థాయి డేటా అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రధాని స్పష్టం చేశారు. అయితే, ఇది చాలా వేగంగా సంక్రమిస్తుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.. కానీ, ఎంతలా అనేది స్పష్టతలేదని యూకే చీఫ్ మెడికల్ ఆఫీసర్ క్రిస్ విట్టే అన్నారు. బ్రిటన్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా సాగడంతో కొద్ది నెలల నుంచి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. వ్యాక్సిన్లు సమర్ధంగా పనిచేస్తున్నాయనడానికి ఇదే రుజువని అధికారులు తెలిపారు. వైరస్ తీవ్రత ఎక్కువగా బాధితులు, హాస్పిటల్‌లో చేరినవారిపై తమ టీకాల తక్కువ ప్రభావం చూపిందనడానికి ఇప్పటి వరకూ ఎటువంటి ఆధారాలు లేవని బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు. గతంలో కొత్త స్ట్రెయిన్ వల్ల భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి.. మేము టీకాలను నమ్ముతున్నాం.. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని పేర్కొన్నారు.


By May 15, 2021 at 08:49AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/uk-may-be-postepone-reopening-plans-due-to-indian-variant-cases-increasing/articleshow/82650403.cms

No comments