Breaking News

చైనా ఆకాంక్షను నెరవేర్చిన శ్రీలంక.. కన్యాకుమారికి 200 కి.మీ. దూరంలో డ్రాగన్


హిందూ మహాసముద్రంలో తన ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసిన చైనా.. భారత్ చుట్టూ ఉన్న బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, మాల్దీవులు తదితర దేశాలను తన గుప్పిట్లో పెట్టుకుంటోంది. చైనా తలపెట్టిన 'బెల్ట్‌ రోడ్‌' ప్రాజెక్టులో శ్రీలంకను ముఖ్యమైన భాగస్వామిగా బీజింగ్‌ నాయకత్వం పరిగణిస్తోంది. హిందూ మహా సముద్రాన్ని దాటుకొని దక్షిణ పసిఫిక్‌, ఆఫ్రికా, ఐరోపాల్లోని 65 దేశాలతో వాణిజ్య బంధాలు నెలకొల్పుకునే క్రమంలో శ్రీలంక ముఖ్యమైన పాత్ర పోషించాలన్నది చైనా ఆకాంక్ష. తాజాగా, చైనా ఆకాంక్షలు నెరవేర్చుతూ శ్రీలంక పార్లమెంట్ కీలక బిల్లుకు గత గురువారం ఆమోదం తెలిపింది. సముద్రం నుంచి స్వాధీనం చేసుకున్న 269 హెక్టార్ల భూమిని అధికారికంగా కొలంబో నగరానికి సేవల-ఆధారిత పరిశ్రమల కోసం దేశంలో మొట్టమొదటి ప్రత్యేక ఆర్థిక జోన్ (సెజ్)‌ను ఏర్పాటుచేస్తూ పోర్ట్ సిటీ ఎకనమిక్ కమిషన్ బిల్లు‌ను ఆమోదించింది. ఈ బిల్లుకు అనుకూలంగా 149 ఓట్లు, వ్యతిరేకంగా 58 ఓట్లు వచ్చినట్టు చైనా అధికారిక మీడియా జున్హూ తెలిపింది. బిల్లుకు ఆమోదం లభించడంతో ఎస్ఈజెడ్ కమిషన్ త్వరలో ఏర్పాటుకానుంది. శ్రీలంక ప్రభుత్వం బిల్లు అమల్లోకి వస్తే కొలొంబోలో ఏదేశం కరెన్సీతో అయినా వ్యాపార కార్యకలాపాలను నిర్వహించవచ్చు. పోర్ట్ సిటీ బిల్లును ఏప్రిల్ 8న పార్లమెంట్ ముందుకు తీసుకురాగా.. దీనికి వ్యతిరేకంగా శ్రీలంక సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. బిల్లుకు అనుకూలంగా గత మంగళవారం న్యాయస్థానం తీర్పు వెలువరిస్తూ.. కొన్ని సవరణలు చేయాలని సూచించింది. పార్లమెంట్‌లో రెండు రోజుల పాటు దీనిపై చర్చ జరిపి సవరణలు అనంతరం మెజార్టీ ప్రజాప్రతినిధులు అనుకూలంగా ఓటేశారు. పోర్ట్ సిటీ ప్రాజెక్టు వల్ల తొలి ఐదేళ్లలో 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని మహేంద్ రాజపక్స వ్యాఖ్యానించారు. పెట్టుబడులను ఆకర్షించవచ్చని పేర్కొన్నారు. కాగా, తూర్పు ఆఫ్రికా, చైనాల మధ్య కీలక వారధిగా శ్రీలంక మాత్రమే అక్కరకొస్తుందని చైనా భావిస్తోంది. శ్రీలంకకు భారీగా రుణాలు మంజూరు చేసి, రుణం ఉచ్చు బిగించింది. ఇప్పటికే శ్రీలంకకు చైనా 800 కోట్ల డాలర్ల రుణం ఇచ్చింది. ఆచరణాత్మక ప్రాతిపదికన చూస్తే ఆ స్థాయి రుణాన్ని తిరిగి చెల్లించడం చాలా కష్టం. ఈ రుణాన్ని అడ్డుపెట్టుకొని శ్రీలంకతో తెలివిగా దౌత్యం నెరిపి, ఆ దేశ దక్షిణ భాగంలోని హాంబన్‌టొట ఓడరేవును తన సైనిక స్థావరంగా మార్చుకునేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తాజాగా కొలొంబోను ఎస్‌ఈజెడ్‌గా ప్రకటించడంతో చైనా అక్కడ పాగా వేయనుంది. భారత్‌లోని కన్యాకుమారికి కేవలం 200 కిలోమీటర్ల దూరంలోని ఈ నగరం ఉండటం గమనార్హం.


By May 25, 2021 at 02:16PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/sri-lankan-parliament-passes-port-city-economic-commission-bill-2021/articleshow/82935569.cms

No comments