Breaking News

కొద్ది గంటల్లో తీరానికి YAAS.. రెడ్ అలర్ట్ జారీ.. సురక్షిత ప్రదేశాలకు 20 లక్షల మంది


తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుఫాను ‘యాస్‌’.. ఒడిశాలోని భద్రక్‌ జిల్లాలో ధామ్రా ఓడరేవు సమీపంలో తీరాన్ని దాటనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ధామ్రా-చాంద్‌బలి మధ్య ఇది భూమిని తాకుతుందని భువనేశ్వర్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ ఉమాశంకర్‌ దాస్‌ తెలిపారు. మంగళవారం సాయంత్రానికి అతి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందిన యాస్... చాంద్‌బలి ప్రాంతానికి అత్యంత ఎక్కువ నష్టం కలిగించే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మృత్యుంజయ మహాపాత్ర పేర్కొన్నారు. ఐఎండీ అంచనాలకు తగ్గట్టుగానే ‘యాస్‌’ అతి తీవ్ర తుఫానుగా మారింది. దీంతో ఒడిశా, బెంగాల్‌ తీర ప్రాంతాలకు ‘‘రెడ్ అలర్ట్’’ జారీ అయింది. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ఐఎండీ బులిటెన్ ప్రకారం ఇది ఒడిశాలోని ధామ్రాకు తూర్పు-ఆగ్నేయంగా 70 కిలోమీటర్లు, పారాదీప్‌కి తూర్పు-ఈశాన్యంగా 90 కిలోమీటర్లు, బాలాసోర్‌కి దక్షిణ-ఆగ్నేయంగా 130 కిలోమీటర్ల, బెంగాల్‌లోని దిఘాకు 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుత గంటకు 12 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. యాస్‌ తుఫాను ధామ్రా పోర్టుకు ఉత్తరంగా, బాలాసోర్‌కు దక్షిణంగా ఉన్న ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నానికి తీరం దాటుతుందని ఐఎండీ పేర్కొంది. ఈ సమయంలో గంటకు 165 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. సముద్రంలో అలలు 2-4 మీటర్ల ఎత్తున ఎగిసిపడతాయని తెలిపింది. సముద్రం అసాధారణ రీతిలో ఉంటుందని అంచనా వేసింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాలపై తుఫాను ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందన్న ఐఎండీ హెచ్చరికలతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఒడిశా, బెంగాల్‌లోని తుఫాను ప్రభావిత తీర ప్రాంతా జిల్లాల నుంచి 20 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటి వరకూ 11 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించిన బెంగాల్ సీఎం ప్రకటించగా.. ఒడిశా దాదాపు 10 లక్షల మందిని శిభిరాలకు పంపింది. బెంగాల్‌లో 74 వేల మంది సిబ్బందిని, 2 లక్షల మందిని రంగంలో దించారు. కలకత్తాపై తుఫాను ప్రభావం ఉంటుందన్న అంచనాలతో విమానాశ్రాయాన్ని బుధవారం 8.30 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకు మూసివేయనున్నారు. అటు ఒడిశా కూడా మంగళవారం రాత్రి 11 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 5 గంటల వరకు భువనేశ్వర్ విమానాశ్రయాన్ని మూసివేసినట్టు ప్రకటించింది. బెంగాల్‌లో తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు ముగ్గురు చనిపోయారు.


By May 26, 2021 at 06:51AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/imd-issues-red-alert-to-odisha-and-west-bengal-for-cyclone-yaas-evacuate-20-lakh-people/articleshow/82962033.cms

No comments