Breaking News

‘#మోదీ రాజీనామా’ పోస్ట్‌లు బ్లాక్‌‌చేసిన ఫేస్‌బుక్.. పొరపాటా? కేంద్రం ఆదేశమా?


దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. రోజువారీ కేసులు, మరణాల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. అయినా, కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కఠిన చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని #ResignModi హ్యాష్‌టాగ్‌తో సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే, ఈ పోస్ట్‌లను ఫేస్‌బుక్ కొద్ది గంటల పాటు బ్లాక్ చేసి మళ్లీ పునరుద్దరించింది. సోషల్ మీడియాలో ఆ కంటెంట్‌ను తొలగించాలని కేంద్రం ఆదేశించడంతో వివాదం చెలరేగింది. తన చర్యలపై వివరణ ఇచ్చిన ఫేస్‌బుక్.. #ResignModi హ్యాష్‌టాగ్‌ను పొరపాటున బ్లాక్ చేశామని, ప్రభుత్వం ఆదేశాలతో కాదని పేర్కొంది. ఫేస్‌బుక్ క్రమానుగతంగా వివిధ కారణాల వల్ల కొన్ని హ్యాష్‌ట్యాగ్‌లను మ్యానువల్‌గా బ్లాక్ చేస్తుంది. కానీ చాలా వరకు అంతర్గత మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటాయి. తాజాగా తలెత్తిన ఇబ్బంది లేబుల్‌తో అనుసంధానమైన కటెంట్ నుంచి వచ్చిందని, హ్యాష్‌ట్యాగ్‌ వల్ల కాదని ఫేస్‌బుక్ ప్రతినిధి తెలిపారు. కీలక రాష్ట్రంలో చివరి దశ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలనే డిమాండ్‌ చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. కరోనా కట్టడికి తీసుకునే ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ ఉన్న కంటెంట్‌ను అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది వీటికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. వీటి ద్వారా ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా దిగ్గజాలలో చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను త్వరగా తొలగించాలని ఆదేశాలు జారీచేసింది. ‘‘మేము ఈ హ్యాష్‌ట్యాగ్‌ను పొరపాటున తాత్కాలికంగా బ్లాక్ చేశాం.. భారత ప్రభుత్వం మమ్మల్ని కోరినందువల్ల కాదు... ప్రస్తుతం దాన్ని పునరుద్ధరించాం’’ అని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి తెలిపారు. దేశంలో కరోనా ఉద్ధృతికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్, ఔషధాల కొరత తీవ్రంగా ఉంది. శ్మశానాల్లో అంత్యక్రియలకు చోటే దొరకడం లేదు. ఢిల్లీ వంటి నగరాల్లో దహనసంస్కరాలకు రెండు మూడు రోజుల నిరీక్షించే పరిస్థితి. అయితే, ఈ దుస్థితికి కేంద్ర ప్రభుత్వం కారణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనాకు సంబంధించి తప్పుడు సమాచారం వ్యాప్తిచేసేలా ఉన్న పోస్ట్‌లు తొలగించాలని, ఇవి ప్రమాదకరమని సోషల్ మీడియాకు కేంద్రం హుకుం జారీచేసింది. దీంతో కోవిడ్ సంబంధిత పోస్ట్‌లను ట్విట్టర్ గత నెల రోజులుగా తొలగింపు లేదా నిషేధిస్తోంది. అలాగే, 500 వరకు ఖాతాలను శాశ్వతంగా తొలగించింది.


By April 29, 2021 at 01:35PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/facebook-blocked-resignmodi-hashtag-and-says-by-mistake-werent-asked/articleshow/82306646.cms

No comments