Breaking News

త్వరగా భారత్‌ను వీడండి.. అనారోగ్యానికి గురైతే వైద్యం కష్టమే: దేశ పౌరులకు అమెరికా హెచ్చరిక


భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ తమ పౌరులను పలు దేశాలు వెనక్కు వచ్చేయాలని పిలుపునిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో అమెరికా చేరింది. భారత్ ప్రయాణాలను మానుకోవాలని గతవారం అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. వీలైనంత త్వరగా భారత్‌ను వీడాలని తాజాగా తమ దేశ పౌరులను అమెరికా హెచ్చరించింది. ఈ మేరకు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ బ్యూరో ఆఫ్ కాన్సులర్ ఆఫైర్స్ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. భారత్‌లో కరోనా వైరస్ కారణంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా అనారోగ్యానికి గురైతే వైద్యం పొందడం అంత సులువు కాదు అని పేర్కొంది. కాబట్టి భారత్‌లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చేయాలని ఆదేశించింది. ఈ మేరకు లెవల్ 4 హెచ్చరికలను కూడా అగ్రరాజ్యం జారీ చేసింది. అందుబాటులో ఉన్న రోజువారీ డైరెక్ట్ విమానాల ద్వారా యూఎస్ చేరుకోవాలని సూచించింది. ఒకవేళ నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో లేనిపక్షంలో వయా పారిస్, ఫ్రాంక్‌ఫర్ట్ ద్వారా స్వదేశానికి చేరుకోవాలని తెలిపింది. అలాగే అమెరికా నుంచి భారత్‌కు ఎవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దని హెచ్చరించింది. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టే వరకు భారత ప్రయాణాలకు దూరంగా ఉండాలని వారం రోజుల కిందట అమెరికా ట్రావెల్ అడ్వైజరీ జారీచేసింది. వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా బారినపడే అవకాశం ఉందని, కాబట్టి భారత పర్యటనను రద్దు చేసుకోవాలని సూచించింది. ఒకవేళ, ప్రయాణం తప్పనిసరి అయితే మాత్రం ముందస్తుగా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకోవాలని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) కోరింది. కోవిడ్ తీవ్రత అత్యంత ఎక్కువ స్థాయిలో ఉన్న దేశాల జాబితా లెవెల్-4లో భారత్ ఉందని సీడీసీ పేర్కొంది. ఒకవేళ పూర్తిస్థాయిలో టీకా వేసుకున్నా అక్కడ వ్యాప్తిలో ఉన్న కోవిడ్ వేరియంట్స్ వల్ల ముప్పు ఉందని తెలిపింది. ‘‘భారత పర్యటన అత్యవసరమైతే టీకా వేసుకోవాలని, మాస్క్ ధరించి ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి... జన సమ్మర్ధాలకు దూరంగా ఉండాలి.. చేతులను తరుచూ శుభ్రం చేసుకోవాలి’’ అని సూచించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ సైతం తమ పౌరులను వెనక్కు వచ్చేయాలని సూచించాయి.


By April 29, 2021 at 01:50PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-issues-level-4-health-alert-asks-its-citizens-to-leave-india-due-to-covid/articleshow/82306976.cms

No comments