Breaking News

కుంభమేళాపై మోదీ ఆసక్తికర ట్వీట్.. ఆ స్వామీజీకి ఫోన్, ముందే ముగిస్తారా?


హరిద్వార్‌లో జరుగుతున్న మహా కుంభమేళాపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ చర్చనీయాంశమవుతోంది. కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ కుంభమేళా వేడుకను ఇకపై ఒక సంకేతంగా మాత్రమే చూడాలని మోదీ వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఇక కుంభమేళాను ముగించాలన్న అర్థం మోదీ ట్వీట్‌లో ధ్వనిస్తోంది. కాగా, నిరంజనీ అఖాడా అధ్యక్షుడు స్వామి అవధేశానంద గిరి మహారాజ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని ప్రధానే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘జునా అఖాడా అధిపతి ఆచార్య మహా మండలేశ్వర్ అవధేశానంద గిరీ స్వామీజీతో నేను ఈ రోజు ఫోన్‌లో మాట్లాడి సాధువుల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాను.. సాధువులందరూ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఇందుకు సాధువులందరికీ నమఃశ్శతం. ఇప్పటి వరకు కుంభమేళాలో సాధువులు రెండుసార్లు పుణ్య స్నానాలు ఆచరించారు... ఇక కుంభమేళాలో జరిగే క్రతువులను ఒక ప్రతీకగా మాత్రమే ఉంచుదాం... ప్రతీకాత్మకంగానే జరుపుకుందాం.దీనివల్ల కరోనా సంక్షోభంపై పోరాడేందుకు బలం వస్తుంది’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కాగా, ప్రధాని విజ్ఞప్తికి స్వామి అవధేశానంద స్పందించారు. ‘‘మోదీ విజ్ఞప్తిని మేం గౌరవిస్తున్నాం.. ప్రాణాలు కాపాడుకోవడం కూడా ముఖ్యమే. పవిత్ర స్నానాల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడవద్దని విజ్ఞప్తి.. కోవిడ్ నియమాలను విధిగా పాటించాలని కోరుతున్నాను’’ అంటూ స్వామి అవధేశానంద ట్వీట్ చేశారు. కరోనా కారణంగా ఈ ఏడాది కుంభమేళాను నెల రోజులకు కుదించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 30తో మేళా ముగియనుంది. సాధారణంగా జనవరి మధ్యలో ప్రారంభమై ఏప్రిల్ చివరితో ఈ వేడుక ముగుస్తుంది. ఏప్రిల్ 5 నుంచి 14 మధ్య 68 మంది ప్రముఖ స్వామీజీలకు వైరస్ నిర్ధారణ అయినట్టు ఉత్తరాఖండ్ అధికారులు ధ్రువీకరించారు. మధ్యప్రదేశ్‌లోని నిర్వాణీ అఖాడా స్వామీజీ మహామండలేశ్వర్ కపిల్ దేవ్ దాస్ (65) కరోనాతో కన్నుమూశారు. కుంభమేళా వద్ద ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 13న ఆయన కన్నుమూసినట్టు అధికారులు గురువారం తెలిపారు. 13 ముఖ్యమైన అఖాడాల్లో నిర్వానీ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో నిరంజనీ అఖాడా సంచలన నిర్ణయం తీసుకుంది. కుంభమేళా నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది. నాగా సాధువులు పెద్ద సంఖ్యలో కలిగి ఉన్న నిరంజనీ అఖండా.. జునా అఖాడా తర్వాత అత్యంత శక్తివంతమైంది. ఏప్రిల్ 17 తర్వాత పుణ్యస్నానాలను విరమించుకుంటున్న అఖాడా తెలిపింది.


By April 17, 2021 at 12:56PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kumbh-mela-should-now-only-be-symbolic-to-strengthen-covid-fight-says-pm/articleshow/82114846.cms

No comments