Breaking News

నేటి నుంచే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం.. మాట నిలబెట్టుకున్న సీఎం


వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా.. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మహిళా ఓటర్లను ఆకర్షించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మార్చి 8న వారికోసం ప్రత్యేకంగా ఎనిమిది కొత్త పథకాలను ప్రకటించింది. అందులో ఒకటి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు పంజాబ్ క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. క్యాబినెట్ ఆమోదంతో ఈ పథకం ఏప్రిల్ 1 (గురువారం) నుంచి అమల్లోకి వచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చిన పంజాబ్ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్.. ఇందుకోసం నూతన పథకాన్ని ప్రవేశపెడుతామని మార్చి 5న‌ అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలో బాలికలు, మహిళలను సాధికారతవైపు నడిపించడంలో భాగంగానే ఈ పథకాన్ని తీసుకువస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సీఎం ప్రకటనకు అనుగుణంగానే ప్రతిపాదనకు పంజాబ్‌ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని పంజాబ్‌ ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఏసీ, వోల్వోతో పాటు ఇతర లగ్జరీ సర్వీసులకు మాత్రం ఇది వర్తించదని స్పష్టంచేసింది. ఉచితంగా ప్రయాణించే మహిళలు పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన వారుగా ఉన్న గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం మహిళలకు లబ్ది చేకూర్చడమే కాకుండా రాష్ట్రంలో మహిళా భద్రతకు ఎంతో దోహదం చేస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడింది. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి సంబంధించిన ప్రతిపాదనలను క్యాబినెట్ ఆమోదించిన విషయాన్ని సీఎం స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ఏప్రిల్-1 నుంచి బాలికలు, మహిళలకు పంజాబ్ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించిన ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం లభించిందని తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది.. రాష్ట్రంలో మహిళా సాధికారికత దిశగా ఇదో ముందడుగు’ అని ట్వీట్ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో అక్కడ దాదాపు 1.31కోట్ల మంది బాలికలు, మహిళలకు లబ్ది కలగనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. అక్కడ 1. 31 కోట్ల మంది మహిళలున్నారు. తాజా పథకం వయసుతో సంబంధం లేకుండా పంజాబ్‌లోని మహిళలందరికీ వర్తించనుంది.


By April 01, 2021 at 11:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/punjab-provide-free-travel-for-women-across-state-on-government-buses/articleshow/81820025.cms

No comments