Breaking News

నేటి నుంచే 45 ఏళ్లుదాటిన వారికి కోవిడ్ టీకా.. కేంద్రం కీలక ఆదేశాలు


దేశంలో కట్టడికి చర్యలు తీసుకుంటూనే, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. అత్యవసర వినియోగం కింద కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలకు అనుమతించిన కేంద్రం.. జనవరి 16 నుంచి పంపిణీ ప్రారంభించింది. తొలి దశలో వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా అందజేశారు. తర్వాత 60 ఏళ్లు దాటిన వృద్ధులు, 45 ఏళ్లదాటి అనారోగ్యంతో బాధపడుతున్నవారికి రెండో దశలో వ్యాక్సినేషన్ ప్రారంభించారు. తాజాగా, 45 ఏళ్లు దాటిని అందరికీ టీకా పంపిణీ గురువారం ప్రారంభమయ్యింది. కరోనా కేసులు అధికంగా నమోదవుతూ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిదానంగా సాగుతున్న ప్రాంతాలను వెంటనే గుర్తించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. అలాంటి ప్రాంతాల్లో కరోనా టీకా పంపిణీని వేగవంతం చేయాలని సూచించింది. రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులు, ఎన్‌హెచ్‌ఎం మిషన్‌ డైరెక్టర్లు, ఇమ్యూనైజేషన్‌ ఆఫీసర్లతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా 45 ఏళ్లు దాటిన వారికి కరోనా టీకా పంపిణీపై చర్చించారు. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల కేటగిరీలో అర్హులైన వారికే టీకా అందేలా చూడాలని పేర్కొన్నారు. కొ–విన్‌ పోర్టల్‌లో తప్పుడు ఎంట్రీలను నివారించాలని సూచించారు. ప్రైవేట్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాల సేవలను సమర్థంగా ఉపయోగించుకోవాలని కోరారు. వ్యాక్సిన్‌ స్టాక్‌ పాయింట్లలో టీకా డోసులు చెడిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పెద్ద సంఖ్యలో వయల్స్ వృథా కావడం పట్ల రాజేష్‌ భూషణ్ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో 6 శాతం డోస్‌లు వృథా అవుతున్నట్లు అంచనా. దీన్ని ఒకటి కంటే తక్కువ శాతానికి తీసుకురావాలని ఆయన ఆదేశించారు. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ స్టాక్‌ను సమయానుగుణంగా వినియోగిస్తే వృథాను అరికట్టి కాలం చెల్లే వ్యాక్సిన్ల సంఖ్యను కనిష్ట స్థాయికి తగ్గించవచ్చని తెలిపారు. వ్యాక్సిన్‌ వినియోగ డేటాను ఎప్పటికప్పుడు కొ-విన్, ఈవిన్‌ పోర్టల్స్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు.


By April 01, 2021 at 10:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/covid-vaccination-for-above-45-years-people-starting-today/articleshow/81818379.cms

No comments