Breaking News

దేశంలో ఉద్ధృతంగా కరోనా.. రెమ్‌డిసివిర్ ఎగుమతులపై కేంద్రం సంచలన నిర్ణయం


దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పడగవిప్పడంతో పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ చికిత్సకు వినియోగించే యాంటీ వైరల్ డ్రగ్ ‘రెమ్‌డెసివిర్‌’ ఎగుమతులపై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కొవిడ్‌-19 నియంత్రణలోకి వచ్చే వరకూ రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు, వాటి తయారీకి వినియోగించే ముడి సరుకుల ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా వైరస్‌తో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నందున, రాబోయే రోజుల్లో రెమ్‌డిసివీర్‌కు డిమాండ్‌ పెరగొచ్చని అంచనా వేసింది. ప్రజలకు రెమ్‌డెసివిర్‌ లభ్యతను పెంచేందుకుగానూ.. వాటిని తయారుచేసే ఫార్మా కంపెనీలు తమ వెబ్‌సైట్లలో స్టాకిస్టులు, డిస్ట్రిబ్యూటర్ల వివరాలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు, సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తమ పరిధిలోని రెమ్‌డెసివిర్‌ నిల్వలను తనిఖీ చేసి, అవి బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తిని పెంచే విషయమై ఫార్మా కంపెనీలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోందని వివరించింది. అమెరికాకు చెందిన గిలీడ్‌ సైన్సెస్‌ అభివృద్ధిచేసిన రెమ్‌డెసివిర్‌‌ను భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు ఏడు సంస్థలు లైసెన్స్ పొందాయి. వీటికి ప్రతినెలా 39 లక్షల ఇంజెక్షన్లను ఉత్పత్తిచేసే సామర్థ్యం ఉంది. రెమ్‌డెసివిర్‌ డ్రగ్ సరఫరా సాఫీగా జరిగేలా చూసేందుకు అన్ని జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర నిర్ణయించింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నాగ్‌పూర్‌లో రెమ్‌డెసివిర్‌ కొరత నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పందించారు. సన్‌ ఫార్మా కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దిలీప్‌ సంఘ్వికి నేరుగా ఫోన్‌ చేసి, నాగ్‌పూర్‌కు 10వేల ఇంజెక్షన్లు పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో 5 వేల రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు పంపుతామని, మిగతావి రెండు రోజుల్లోగా అందిస్తామని దిలీప్‌ సంఘ్వి హామీ ఇచ్చారు. మహమ్మారి కొత్త రికార్డులను నెలకొల్పుతుంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1.69 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా.. మరో 903 మంది కోవిడ్-19కు బలయ్యారు. మహారాష్ట్రలో రోజువారీ కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. అక్కడ రాత్రి కర్ఫ్యూలు, వారాంతపు లాక్‌డౌన్‌లు అమలవుతున్నా వైరస్ ఉద్ధృతి ఏమాత్రం తగ్గలేదు.


By April 12, 2021 at 09:06AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-bans-export-of-anti-viral-drug-remdesivir-amid-surge-in-coronavirus-cases/articleshow/82024693.cms

No comments