Breaking News

దేశంలో కోటిన్నర దాటిన కోవిడ్ బాధితులు.. గత 24 గంటల్లో 2.74 లక్షల కేసులు


భారత్‌లో కరోనా వైరస్‌ విలయతాండవం కొనసాగుతోంది. రెండో దశలో మహమ్మారి వ్యాప్తి ప్రమాదకరంగా ఉంది. రోజువారీ కేసులు 3 లక్షలకు చేరువ కావడం వైరస్‌ తీవ్రతకు అద్దంపడుతోంది. దేశంలో వరుసగా ఐదో రోజూ రెండు లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 13.56 లక్షల పరీక్షలు నిర్వహించగా.. 2,73,810 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య కోటిన్నర దాటింది. అలాగే, కరోనా మరణాలు కూడా రికార్డుస్థాయిలో చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం అత్యధికంగా 1,619మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో వైరస్ మొదలైన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కోవిడ్ మరణాలు నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో కోవిడ్-19తో ప్రాణాలు కోల్పోయిన బాధితుల సంఖ్య 1,78,769కి చేరింది. దేశంలో మొత్తం 1,50,61,919 మంది వైరస్ బారినపడగా.. వీరిలో 1,29,53,821 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొదటి దశతో పోల్చితే రెండో దశలో రికవరీ రేటు తగ్గిపోతోంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 86.62శాతానికి చేరింది. ఇక మరణాల రేటు 1.20 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ సంఖ్య 19,29,329 కి పెరిగింది. గడచిన 24 గంటల్లో మరో 1,44,178 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. మరోవైపు, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. గడిచిన 24గంటల్లో 12.30లక్షల మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం టీకా అందిన వారి సంఖ్య 12,38,52,566కి చేరింది. మహారాష్ట్రలో లాక్‌డౌన్ కొనసాగుతున్నా పరిస్థితుల్లో ఎటువంటి మార్పులేదు. ఆదివారం అక్కడ 68,631 కేసులు నమోదుకాగా.. 503మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత ఉత్తర్ ప్రదేశ్‌లో 30,577 కేసులు.. 127 మరణాలు చోటుచేసుకున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో 25,462 కేసులు నమోదు కాగా, 161 మంది మహమ్మారికి బలయ్యారు. దేశవ్యాప్తంగా మరో ఏడు రాష్ట్రాల్లో 10వేలకుపైగా కేసులు నిర్ధారణఅయ్యాయి. కర్ణాటకలో 19,067, కేరళలో 18,536 మందికి వైరస్ బయటపడింది.


By April 19, 2021 at 10:30AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-covid-cases-crossed-one-and-half-crores-and-273810-new-cases-1619-deaths-in-last-24-hours/articleshow/82138756.cms

No comments