Breaking News

మీ బెదిరింపులు కట్టిపెట్టండి.. అమెరికాకు సౌదీ స్ట్రాంగ్ కౌంటర్


వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ హత్య మొహమూద్ బిన్ సల్మాన్ ఆమోదంతోనే జరిగిందంటూ అమెరికా నిఘా వర్గాల నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్రంగా స్పందించిన సౌదీ ఆరేబియా మీడియా.. యువరాజుకు బాసటగా నిలిచింది. అమెరికా నివేదిక సౌదీ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించేలా ఉందని మండిపడింది. ఖషోగ్గీ హత్యలో తన ప్రమేయం లేదని యువరాజు సల్మాన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ హత్యలో ప్రమేయం ఉన్నవారిపై అమెరికా యంత్రాంగం ఆంక్షలు విధించినప్పటికీ, యువరాజును మాత్రం తప్పించింది. ‘వ్యూహాత్మక ప్రాంతీయ మిత్రదేశాన్ని బెదిరించే హక్కు అమెరికాకు లేదు.. దేశ అంతర్గత విభేదాలతో ప్రాంతీయ ప్రయోజనాలు, దాని భాగస్వాములకు హాని కలిగించాలనే ఆసక్తి మంచిది కాదు’ అని అల్ జజీరా పత్రిక సంపాదకుడు ఖలేద్ అల్ మాలిక్ అన్నారు. మొదటి గల్ఫ్ యుద్ధం, 2019లో ఆయిల్ రిఫైనరీలపై దాడులు సహా రక్షణ కోసం అమెరికాపై ఆధారపడిన సౌదీ అరేబియా.. ప్రస్తుతం ఆయుధాల కోసం చైనా, రష్యా వైపు చూడవచ్చు అని మాలిక్ వ్యాఖ్యానించారు. ‘కానీ వ్యూహాత్మక, చారిత్రక సంబంధాలు, సాధారణ లక్ష్యాల నేపథ్యంలో అమెరికాకే సౌదీ తొలి ప్రాధాన్యత ఇవ్వనుంది’ అన్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నివేదికను బయటపెట్టకుండా సౌదీ పాలకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. నివేదికను వెల్లడించిన ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్.. సౌదీకి ఆయుధాల అమ్మకంపై సమీక్షించాలని ఆదేశించారు. ఈ అంశంపై అమెరికా సోమవారం ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. అరబ్ దేశాల్లో అమెరికాకు సౌదీ చిరకాల మిత్రదేశం.. బెదిరింపులతో భయపడిపోవడానికి ఇది బనానా రిపబ్లిక్ కాదు అని అష్రఖ్ అల్ అవసాత్ పత్రిక ఎడిటర్ అబ్డుల్లాహ్ అల్-ఒటైబీ అన్నారు. ‘ఇరు దేశాల మధ్య పాతుకుపోయిన సంబంధాలను మరింత బలోపేతం చేయాలనుకుంటున్నాం. కానీ మన సార్వభౌమాధికారం తాకట్టు పెట్టికాదు.. మా న్యాయవ్యవస్థ, మా నిర్ణయాలు’ ఒకాజ్ పత్రిక ఎడిటర్ ఫాహిమ్ అల్-హమిద్ అన్నారు. ఇక, ఖషోగ్గీ హత్యను ఖండిస్తూ గతంలో పలుసార్లు ప్రకటన చేసిన సౌదీ.. ఈ కేసులో ఎనిమిది మందికి అక్కడ కోర్టు జైలు శిక్ష విధించింది. అమెరికా నివేదిక విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో యువరాజుకు మద్దతుగా లక్షలాది మంది ట్వీట్లు చేస్తున్నారు. మేమంతా మొహమూద్ బిన్ సల్మాన్ వెంట ఉన్నామని, దీనికి సంబంధించిన హ్యాష్‌టాగ్‌ను వాడుతున్నారు.


By March 01, 2021 at 09:30AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/saudi-media-slams-on-us-move-against-crown-prince-in-journalist-khashoggi-murder/articleshow/81266685.cms

No comments