Breaking News

లాక్‌డౌన్ కాలంలో రుణ మారిటోరియంపై సుప్రీం సంచలన తీర్పు


గతేడాది కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా బ్యాంకు రుణాలపై ఆర్బీఐ మారిటోరియం విధించిన విషయం తెలిసిందే. మారిటోరియం కాలంలో బ్యాంకులు చక్రవడ్డీని వసూలుచేయడాన్ని సవాల్ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన మంగళవారం తీర్పును వెలువరించింది. లాక్‌డౌన్ కాలంలో రుణాలపై వడ్డీని మాఫీ చేయాలని బ్యాంకులకు సూచించాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాదు, ఆగస్టు 31 వరకు విధించిన మారిటోరియం కాలాన్ని పొడిగించమని చెప్పలేమని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఆర్ధిక విధానాల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోజాలదని ఈ సందర్భంగా జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే, రూ.2 కోట్ల వరకు రుణాలపై వడ్డీపై వడ్డీని వదులుకోవడం వెనుక గల కారణాన్ని సుప్రీంకోర్టు అర్ధం చేసుకోలేకపోయిందని, రూ .2 కోట్ల పరిమితిని ఎందుకు వివరించలేదని జస్టిస్ ఎంఆర్ షా ప్రశ్నించారు. ఆర్ధిక, వాణిజ్య విభాగాల్లో న్యాయమూర్తులు నిష్ణాతులు కారు, ఈ రంగాల్లోని విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని పేర్కొన్నారు. మారిటోరియం కాలంలో రుణాల వడ్డీపై వడ్డీని బ్యాంకులు వసూలు చేస్తే వాటిని తిరిగి చెల్లించడం లేదా తదుపరి ఈఎంఐకి సర్దుబాటు చేయాలని సూచించింది. ఇదిలా ఉండగా, ఎంఎస్ఎంలు, విద్యా, గృహ, వినియోగదారు వస్తువులు, ఆటో రుణాలు సహా క్రెడిట్ కార్డ్ బకాయిలపై వడ్డీ మినహాయింపు చేస్తున్న‌మ‌ని, రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాల చక్రవడ్డీ మాఫీ ఒక్కటే చేయగలమని కేంద్రం తన అఫిడ్‌విట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. మారటోరియం కాలం గడువు పొడిగించలేమని మరో అఫిడవిట్‌లో కేంద్రం కోర్టుకు తెలిపింది. కరోనాతో ఆదాయం తగ్గిన వివిధ రంగాల వారికి మారటోరియంతో ఊరట కల్పించామని, రుణగ్రహీతలకు చక్రవడ్డీ మాఫీ చేశామని, ఇంతకంటే ఎక్కువ ఉపశమనాలు ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఆర్థిక విధానాలు ప్రభుత్వానికి చెందినవని, ఇందులో కోర్టుల జోక్యం తగదని పేర్కొంది. చక్రవడ్డీ మాఫీ చేయడం కాకుండా ఇతర ఉపశమనాలు కల్పించలేమని.. అలా చేస్తే ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌ రంగం ప్రమాదంలో పడుతుందని కేంద్రం వివరించింది. రంగాలవారీగా ఉపశమనం కల్పించడం కుదరదని, కామత్‌ కమిటీ నివేదిక కూడా ఇదే చెబుతోందని కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు రుణాలపై మారటోరియం గడువును మరింతకాలం పెంచలేమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సుప్రీంకోర్టుకు తెలిపింది. మారటోరియం కాలాన్ని పొడిగిస్తే అది వాయిదాల చెల్లింపులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. మారటోరియం కాలం పొడిగింపు వల్ల రుణగ్రహీతలపై భారం పెరుగుతుందని వివరించింది.


By March 23, 2021 at 11:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-verdict-on-bank-loan-moratorium-case/articleshow/81646159.cms

No comments