Breaking News

ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తీరత్ సింగ్ రావత్.. అనూహ్యంగా వరించిన పదవి


ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్‌ పేరు ప్రకటించారు. సీఎం పదవికి త్రివేంద్ర సింగ్ రావత్ మంగళవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో పౌరీ గర్వాల్ ఎంపీ తీరత్ సింగ్‌ను ఎంపిక చేశారు. డెహ్రాడూన్‌లోని కార్యాలయంలో శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి కొత్త సీఎంగా తీరత్‌ను ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం పలువురు ఆశావాహుల పేర్లను పరిశీలించి, చివరకు తీరత్ వైపే బీజేపీ అధిష్ఠానం మొగ్గుచూపింది. ఎమ్మెల్యేలు ధన్‌సింగ్‌ రావత్, ఎంపీలు అజయ్ భట్, అనిల్ పేర్లు వినిపించినా చివరకు అనూహ్యంగా తీరత్‌కే ఓటేశారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో సీఎంగా తీరత్ సింగ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా, సొంత పార్టీ నేతలు కొన్నాళ్లుగా త్రివేంద్ర సింగ్ రావత్ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయనను సీఎం పదవి నుంచి తప్పించారు. నాయకత్వ మార్పు చేయాలని బీజేపీ అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొచ్చి, ముఖ్యమంత్రిని మార్చాలని పట్టుబట్టారు. సీఎం మార్పు కోసం కనీసం 10 మంది పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఢిల్లీలో మకాం వేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి రంగంలోకి దిగిన బీజేపీ అధిష్ఠానం.. ఇటీవల ఇద్దరు సీనియర్‌ నేతలను ఉత్తరాఖండ్‌కు పంపింది. అక్కడ పరిస్థితులపై ఓ నివేదికను రూపొదించి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు అందజేశారు. దీంతో సోమవారం ఢిల్లీకి వెళ్లిన త్రివేంద్ర సింగ్ రావత్ పార్టీ పెద్దలను కలిశారు. సీఎం పదవి నుంచి దిగిపోవాలని పార్టీ పెద్దలు రావత్‌కు సూచించినట్లు సమాచారం. అధిష్టానం ఆదేశాలతో ఆయన రాజీనామా చేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో త్రివేంద్ర సింగ్‌ రావత్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. నాలుగేళ్ల పాటు ఆయన సీఎంగా ఉన్నారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందు సీఎంను మార్చడం చర్చనీయాంశంగా మారింది.


By March 10, 2021 at 11:59AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tirath-singh-rawat-to-be-new-chief-minister-of-uttarakhand/articleshow/81425745.cms

No comments