Breaking News

50 శాతం కెపాసిటీతో థియేటర్లు, ఆఫీసులు.. మహారాష్ట్ర తాజా కోవిడ్ గైడ్‌లైన్స్


కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విజృంభించడంతో మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో పూర్తిస్థాయి, పాక్షిక లాక్‌డౌన్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా, థియేటర్లు, ఆడిటోరియంలు, కార్యాలయాలకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. కేవలం 50 శాతం మందిని మాత్రమే అనుమతించాలని ఆదేశాలు జారీచేసింది. మార్చి 31 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది. గడచిన 24 గంటల్లో మహారాష్ట్రలో దాదాపు 26 వేల పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోతే మరోసారి కఠినమైన లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రజలను హెచ్చరించిన వారం రోజుల్లోనే తాజా మార్గదర్శకాలను వెల్లడించడం గమనార్హం. ‘ఆరోగ్య, ఇతర అత్యవసర సేవలు మినహా అన్ని ప్రయివేట్ కార్యాలయాలు 50 శాతం మందితో పనిచేయాలి’ అని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇవి ప్రభుత్వ, సెమీ-గవర్నమెంట్ ఆఫీసులకు వర్తిస్తాయి. అయినప్పటికీ, ఉత్పాదక రంగంలోని కార్యాలయాలు తక్కువ సిబ్బందితో పనిచేయాల్సి ఉంటుంది. ఉత్పాదక పరిశ్రమల్లో సామాజిక దూరాన్ని పాటించడం కోసం స్థానిక అధికారులు ఆమోదంతో వర్కింగ్ షిఫ్ట్‌లను పెంచడానికి తయారీ యూనిట్లకు అవకాశం ఉందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒకవేళ కోవిడ్ నిబంధనలను అతిక్రమిస్తే ప్రభుత్వం పునఃప్రారంభించే వరకూ మూసేయాల్సి వస్తుందని హెచ్చరించింది. హాట్ స్పాట్ ప్రదేశాలపై ప్రభుత్వం ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. వైరస్ అనేక జాతులుగా మ్యుటేషన్ చెందినట్టు అనుమానిస్తున్న నిపుణులు.. కేసులు భారీ సంఖ్యలో పెరగడానికి కారణమని భావిస్తున్నారు. ముంబయిలోని ధారవీలో ఆరు నెలల తర్వాత భారీగా పాజిటివ్ కేసులు పెరిగాయి. తాజా గణాంకాల ప్రకారం గడచిన 24 గంటల్లో అక్కడ 30 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారవీలో చివరిసారిగా గతేడాది సెప్టెంబరు 11న 33 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 30కిపైగా కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి.


By March 19, 2021 at 05:06PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/theatres-and-offices-allow-only-50-per-cent-of-their-capacity-till-march-31-in-maharashtra/articleshow/81588850.cms

No comments