ఉత్తరాఖండ్ విషాదానికి అక్కడ అమ్మవారి గుడి తొలగించడమే కారణమా?


ఉత్తరాఖండ్‌లో జలప్రళయం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఉపద్రవానికి అసలు కారణం అంతుబట్టడంలేదు. ఈ ఘటనకు సంబంధించి రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఫిబ్రవరి 7న దుర్ఘటన జరగడానికి ముందు అలకనంద నదిలో చేపలు వింతగా ప్రవర్తించాయి. ఈ విషయాన్ని స్థానికులు ఆ రోజు గుర్తించలేకపోయారని, ముప్పు రాబోతుందని గ్రహించడం వల్లే ఆ చేపలు అలా ప్రవర్తించి ఉంటాయని అంటున్నారు. అయితే, తమ గ్రామంలోని అమ్మవారి ఆలయాన్ని తొలగించడం వల్లే ఈ ప్రళయం సంభవించిందని రైనీ గ్రామస్థులు అంటున్నారు. చమోలీ జిల్లా తపోవన్ ప్రాంతంలోని వద్దే మంచు చరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. గ్రామంలోని అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ ప్రాజెక్ట్ కోసం తొలగించారని, అందువల్లే అమ్మవారు ఆగ్రహించారని అంటున్నారు. ఇక, 2013లో ఉత్తరాఖండ్ వరదలప్పుడూ కూడా ఇటువంటి ప్రచారమే జరిగింది. రుద్రప్రయాగ్ జిల్లా గర్వాల్ శ్రీనగర్ సమీపంలోని ధారీ దేవి ఆలయాన్ని జల విద్యుత్ ప్రాజెక్ట్ కోసం మరో చొటుకి తరలించడంతోనే వరదలు సంభవించాయనేది జనం నమ్మకం. ధారి అమ్మవారిని తరలించకుండా ఉండాల్సిందని, అమ్మ ఆగ్రహం వల్లే ప్రధాన ఆలయం కొట్టుకుపోయిందని బలంగానమ్ముతారు. మరోవైపు, తపోవన్ విద్యుత్తు కేంద్రం సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి బుధవారం కూడా విశ్వప్రయత్నాలు కొనసాగాయి. ఇందులో 30-35 మంది చిక్కుకొని పోగా వారి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. లోపల ఉన్నవారిని ఎలాగైనా ఆదుకోవాలన్న లక్ష్యంతో పూడుకుపోయిన మట్టికే రంధ్రాలు చేసి ఆక్సిజన్ పంపించనున్నారు. ఈ ఘటనలో జాడలేని వారిలో ఇద్దరు ఇళ్లకు చేరుకోగా.. మరో 172 మంది ఏమయ్యారో తెలియాల్సి ఉంది. రోజులు గడిచేకొద్దీ వారి కుటుంబ సభ్యుల్లో ఆశలు సన్నగిల్లుతుండడంతో ఆందోళన నెలకొంది. 1.6 కిలోమీటర్ల పొడవైన సొరంగంలో ఇంతవరకు 120 మీటర్ల మేర పూడికను తీయగలిగారు. అయినా ఇంకా నీరు, బురద కొట్టుకొని వస్తుండడంతో సహాయ చర్యలకు ఇబ్బందికరంగా మారింది. కొన్ని చోట్ల మట్టి గట్టిపడడం కూడా సమస్యలు సృష్టిస్తోంది. ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసులకు చెందిన 450 మందితో పాటు, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, సైనికులు మొత్తం 600కుపైగా జవాన్లు సమన్వయంతో పనిచేస్తున్నారు.
By February 11, 2021 at 09:40AM
No comments