Breaking News

ధైర్యముంటే ముందు అభిషేక్‌పై పోటీచేసి గెలవండి.. అమిత్ షాకు దీదీ సవాల్!


పశ్చిమ్ బెంగాల్‌ అసెంబ్లీకి మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనుండగా.. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడంతో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. తాజాగా, కేంద్ర హోం మంత్రి తమపై చేస్తున్న ఆరోపణలను సీఎం తిప్పికొట్టారు. అంతేకాదు, ధైర్యముంటే మొదట తన మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీపై ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాతే తనను ఎదుర్కోవాలని షాకు సవాల్ విసిరారు. దక్షిణ పరగణాల జిల్లాలోని పైలాన్‌ ప్రాంతంలో జరిగిన ర్యాలీలో పాల్గొని ప్రసంగించిన మమతా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విరుచుకుపడ్డారు. మమతా తర్వాత టీఎంసీలో అభిషేక్ బెనర్జీకే అత్యంత ప్రాధాన్యత ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తృణమూల్‌ కూడా కుటుంబ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందని బీజేపీ విమర్శిస్తోంది. ముఖ్యమంత్రి పీఠాన్ని అభిషేక్‌కు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ చేస్తోన్న విమర్శలకు దీదీ దీటుగా బదులిచ్చారు. పార్టీలో అందరిలాగే అభిషేక్ కూడా ఒకరని, అతడికి ప్రత్యేక మినహాయింపులు ఉండవని వ్యాఖ్యానించారు. ‘నాపై 1990 ఆగస్టు 16న సీపీఎం కార్యకర్తలు కోల్‌కతాలో దాడికి పాల్పడే సమయానికి అభిషేక్ చాలా చిన్న పిల్లాడు... నాపై ఎందుకు దాడి జరిగింది? అని అడుగుతూ జెండా పట్టుకుని చుట్టూ తిరుగుతూ నా ప్రశ్నకు సమాధానం చెప్పాలని నిలదీశాడు’ అని అన్నారు. ‘ఒకసారి అతనిపై దాడికి ప్రయత్నించలేదా? అతను ఇప్పటికీ ఒక కంటిని సరిగ్గా చూడలేడు.. ఇది దాదాపు అందరికీ తెలుసు.. అభిషేక్‌‌ను నేరుగా రాజ్యసభ ద్వారా పార్లమెంట్‌కు పంపొచ్చు.. కానీ, ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొని ప్రజాతీర్పుతోనే లోక్‌సభలో అడుగుపెడతానన్నాడు.. అందుకే ముందుగా అభిషేక్‌ బెనర్జీపై గెలిచి, తనపైన విమర్శలు చేయాలి’ అని మమతా సవాల్‌ విసిరారు. అంతటితో ఆగని మమతా.. కుమారుడు వ్యాపారాల గురించి ప్రశ్నించారు. జై షా క్రికెట్‌ అసోసియేషన్‌లో ఎలా స్థానం సంపాదించారని దీదీ నిలదీశారు. వందల కోట్ల రూపాయలను ఎలా సంపాదిస్తున్నారని ఆరోపించారు. దుమ్ముంటే అమిత్ షా తన కుమారుడ్ని రాజకీయాల్లోకి తీసుకురావాలి అని మరో సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో తృణమూల్‌ విజయం సాధిస్తుందని, గత ఎన్నికల రికార్డులను తిరగరాస్తామని మమతా ఉద్ఘాటించారు. అటు, రెండు రోజుల బెంగాల్ పర్యటలో భాగంగా దక్షిణ 24 పరగణాల జిల్లాలో అమిత్ షా గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా కాక్‌ద్విప్‌ ప్రాంతంలో పరివర్తన్‌ ర్యాలీని అమిత్‌ షా ప్రారంభించారు. ర్యాలీలో షా మాట్లాడుతూ.. మమతా బెనర్జీ సర్కార్‌ను ఓడించి బీజేపీని అధికారం చేపట్టడమే తమ లక్ష్యం కాదని, ఇక్కడి పరిస్థితుల్లో మార్పు తేవడమే లక్ష్యమని అన్నారు. బెంగాల్‌ను బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకే బీజేపీ పోరాడుతోందని పేర్కొన్నారు. దీనికి మమతా మేనల్లుడు అభిషేక్ కౌంటర్ ఇచ్చారు.


By February 19, 2021 at 10:59AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/first-fight-abhishek-then-me-west-bengal-cm-mamata-banerjee-challenges-amit-shah/articleshow/81103971.cms

No comments