Breaking News

కొత్త స్ట్రెయిన్ కేసులు.. విమాన ప్రయాణాలపై కేంద్రం కీలక మార్గదర్శకాలు


దేశంలో కొత్తగా దక్షిణాఫ్రికా, బ్రెజిల్ కోవిడ్ స్ట్రెయిన్ కేసులు నమోదుకావడంతో కేంద్రం అప్రమత్తమయ్యింది. యూకే స్ట్రెయిన్ కంటే ఇవి అత్యంత ప్రమాదికారి కావడంతో అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. యూకే, ఐరోపా, మధ్య ఆసియా మినహా ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఈ కొత్త మార్గదర్శకాలు వర్తిస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ నాలుగు, బ్రెజిల్ వేరియంట్ ఒక్క కేసు నమోదయినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. అలాగే 187 నమోదయినట్టు పేర్కొంది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతిస్తారు. కానీ, కుటుంబంలో ఎవరైనా చనిపోతే అటువంటి వారికి మినహాయింపు ఉంటుంది. ఈ మేరకు ట్విట్టర్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ పోస్ట్ చేసింది. ‘ప్రయాణీకులకు విజ్ఞ‌ప్తి! అంతర్జాతీయ ప్రయాణికులందరూ (యూకే, ఐరోపా, మధ్య ఆసియా నుంచి వచ్చే విమానాలలో వచ్చే ప్రయాణికులు తప్ప) భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలి’ అని పేర్కొంది. యూకే, ఐరోపా, మధ్య ఆసియా మీదుగా భారత్‌కు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను తమ సొంత ఖర్చులతోనే చేయించుకోవాలి. దక్షిణాఫ్రికా, బ్రెజిల్ నుంచి నేరుగా భారత్‌కు విమానాలను నిలిపివేసినట్టు తెలిపింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎవరైనా పాజిటివ్ అని తేలితే, స్ట్రెయిన్‌ను గుర్తించడానికి ప్రత్యేక ప్రోటోకాల్ అనుసరించాలి. ఐసీఎంఆర్ చీఫ్ డాక్టర్ బలరామ్ భార్గవ్ ప్రకారం.. ప్రస్తుత వ్యాక్సిన్లకు యూకే వేరియంట్‌‌ను తటస్థీకరించే సామర్థ్యం ఉంది.. దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్‌లపై వ్యాక్సిన్ల ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి అని అన్నారు. ‘ఐసీఎంఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) సార్స్ కోవి-2 దక్షిణాఫ్రికా వేరియంట్‌ను వేరుచేయడానికి ప్రయోగాలు కొనసాగుతున్నాయి.. బ్రెజిల్ వేరియంట్‌ను ఇప్పటికే వేరుచేశారు’ అని బలరామ్ భార్గవ్ అన్నారు.


By February 18, 2021 at 07:46AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/new-covid-strains-surface-in-india-centre-issues-new-guidelines-for-travellers/articleshow/81081716.cms

No comments