Breaking News

లడఖ్‌లో క్యాంప్‌లను ఖాళీచేసిన చైనా.. వెల్లడించిన తాజా ఉపగ్రహ చిత్రాలు


తూర్పు సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన క్రమంగా వీడుతోంది. ఇరు దేశాలూ బలగాల ఉపసంహరణపై ఓ అంగీకారానికి వచ్చి, వివాదాస్పద ప్రాంతాల నుంచి వైదొలగుతున్న విషయం తెలిసిందే. పాంగాంగ్ సరస్సు ఉత్తరతీరం సహా పలు ప్రాంతాల నుంచి చైనా తన బలగాలను పూర్తిగా వెనక్కు మళ్లించినట్టు తాజాగా విడుదలైన శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. లడఖ్ రీజియన్‌లోని పాంగాంగ్ సరస్సు, గ్లేసియల్ లేక్ తీరం నుంచి సైన్యాలు, యుద్ధ ట్యాంకులు, ఇతర సైనిక యంత్రాగాన్ని చైనా తరలించినట్టు బుధవారం వెల్లడించిన ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టమవుతోంది. జనవరి చివరిన విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలు ఈ ప్రాంతాల్లో సీపీఎల్ఏ క్యాంప్‌లు ఉన్నట్టు స్పష్టం చేయగా.. ప్రస్తుతం వాటిని తొలగించారు. భారత్ వైపు నుంచి కూడా సైన్యం ఉపసంహరణ జరుగుతోందని పేరు వెల్లడించడానికి నిరాకరించిన ఓ అధికారి రాయిటర్స్‌కు తెలిపారు. భారత్-చైనాల మధ్య తూర్పు సరిహద్దుల్లో గతేడాది మే మొదటివారం నుంచి కొనసాగుతున్న ప్రతిష్టంభనపై అనేక దౌత్య, సైనిక చర్చలు ఉన్నప్పటికీ ఫిబ్రవరి వరకు ఇరు దేశాలు ఒక అవగాహనకు రాలేకపోయాయి. ఇది బలగాల ఉపసంహరణ మొదటి దశను క్లిష్టతరం చేసింది. ‘సరిహద్దుల్లో ముఖ్యంగా పాంగాంగ్ సరస్సు ఉత్తరం, దక్షిణ తీరంలో ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతున్న చోట, ఉద్రిక్తతలను తగ్గించడానికి, బలగాల ఉపసంహరణకు మార్గం సుగమం చేయడానికి ఒక అడుగు వెనక్కి వేశారు’ అని అధికార వర్గాలు తెలిపాయి. చైనా తన బంకర్లు, గుడారాలు, ట్యాంకులు, వాహనాలు, సైన్యాలను తొలగించిన వీడియోలను ఇండియన్ ఆర్మీ రెండు రోజుల కిందట విడుదల చేసింది. అయితే, బలగాల ఉపసంహరణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది తొలి దశ మాత్రమేనని, ఈ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగనుందని పేర్కొన్నారు. ఇది ఇంకా పూర్తిస్థాయిలో మళ్లింపు లేదా మనం ఏమి చేయాలనే దానిపై ఒక ఒప్పందానికి రాలేదు అని మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ వ్యాఖ్యానించారు. ‘బలగాల వెనక్కు మళ్లింపు కంటే చాలా ఎక్కువ అవసరం.. గత ఏడాది ఏప్రిల్ ముందున్న యథాతథ పరిస్థితికి రావాలి’ అని అన్నారు.


By February 18, 2021 at 08:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/lac-row-new-satellite-images-show-china-vacating-military-camps-at-ladakh/articleshow/81082081.cms

No comments