Breaking News

జీవితకాల అనుభవాల్ని అందించారు, ధన్యవాదాలు.. కిరణ్ బేడీ భావోద్వేగం


పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి వైదొలిగిన మాజీ ఐపీఎస్ భావోద్వేగంగా స్పందించారు. తాను ఏం చేసినా విధుల పట్ల నైతిక బాధ్యతతోనే చేశానని చెప్పారు. తనకు జీవిత కాల అనుభవాల్ని అందించేలా చేసిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు బుధవారం (ఫిబ్రవరి 17) ఆమె తన వీడ్కోలు లేఖను ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. ఇక భవిష్యత్తు పుదుచ్చేరి ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. ‘రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిగా నా విధులను విలువలతో బాధ్యతాయుతంగా నిర్వర్తించాను. పుదుచ్చేరికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అవకాశం కల్పించి నాకు జీవిత కాల అనుభవాల్ని అందించేలా చేసిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. రాజ్ నివాస్ సిబ్బంది సహకారంతోనే ఇదంతా సాధ్యమైంది. నాతో కలిసి పనిచేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు’ అని కిరణ్ బేడీ అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం రాజ్‌ నివాస్ సిబ్బంది ఉన్నతంగా కృషి చేశారని కిరణ్ బేడీ కొనియాడారు. ‘పుదుచ్చేరికి మంచి భవిష్యత్తు ఉంది. అది పుదుచ్చేరి ప్రజల చేతిలోనే ఉంది. భవిష్యత్తులోనూ అభివృద్ధి పథంలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’ అని కిరణ్‌ బేడీ తన వీడ్కోలు లేఖలో తెలిపారు. తన పదవీ కాలం తనకు సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవీ బాధ్యతల నుంచి కిరణ్ బేడీని తొలగిస్తూ రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌ను కేటాయించేంత వరకు తమిళిసై ఆ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.


By February 17, 2021 at 03:05PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/thanks-for-lifetime-experience-kiran-bedi-emotional-send-off-letter-after-being-removed-as-puducherry-lieutenant-governor/articleshow/81050437.cms

No comments