Breaking News

బీజేపీకి రైతుల సెగ.. పంజాబ్‌లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్!


పంజాబ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. పంజాబ్‌లో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ ఆశలను ఆడియాశలు చేసింది. కొత్త రికార్డులు సృష్టించింది. 8 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను 7 కార్పొరేషన్లకు ఫలితాలు వెల్లడి కాగా.. ఆ ఏడింటినీ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఫలితాలు వెల్లడి కావాల్సిన మరో మున్సిపల్ కార్పొరేషన్‌లోనూ విజయానికి బాటలు వేసుకొని క్లీన్ స్వీప్‌కు మార్గం సుగమం చేసుకుంది. ఆయా మున్సిపాలిటీల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. మొహాలీ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు గురువారం వెల్లడి కానున్నాయి. అక్కడ కూడా మున్సిపల్ పీఠాన్ని తామే దక్కించుకుంటామని కాంగ్రెస్ నేతలు దీమాగా చెబుతున్నారు. అటు నగర పంచాయతీల్లోనూ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్జీ సాధించింది. ఘన విజయం అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మొహాలీలో రెండు వార్డులకు బుధవారం రీపోలింగ్ నిర్వహించారు. ఈ రీపోలింగ్ కారణంగా అక్కడ ఓట్ల లెక్కింపు గురువారం చేపట్టాలని ఈసీ ఆదేశించింది. బీజేపీపై రైతుల ఆందోళన ప్రభావం పడింది. పంజాబ్‌లో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి అధికారం దక్కించుకోవాలని భావిస్తున్న ఆ పార్టీని ఓటర్లు ఖంగు తినిపించారు. విజయదుందుభి సాగిందిలా.. ★ అబొహర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 50 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 49 వార్డుల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ విజయదుందుభి ఏ రీతిన సాగిందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ★ కేంద్ర మాజీ మంత్రి, శిరోమణి అకాలీదల్ నాయకురాలు హర్‌సిమ్రన్ కౌర్ నియోజకవర్గ పరిధిలోని బతిండా మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ ఘన విజయాన్ని నమోదు చేసింది. అక్కడ 50 వార్డులకు గాను 43 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 53 ఏళ్ల తర్వాత తొలిసారిగా అక్కడ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోనుండటం విశేషం. ★ హోషియార్పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 41 వార్డులకు గాను 37 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ★ ఈ ఎన్నికల్లో ఓట్ల శాతం, సీట్ల పరంగా బీజేపీ నాలుగో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ తర్వాత శిరోమణి అకాలీదల్, ఆమ్ ఆద్మీ పార్టీ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. బీజేపీతో అంటకాగినందుకు శిరోమణి అకాలీదల్ పార్టీకి కూడా ఓటర్లు గట్టి గుణపాఠం చెప్పారు. ఎన్డీయే కూటమిలో కొనసాగిన శిరోమణి అకాలీదల్.. వ్యవసాయ చట్టాలపై బీజేపీతో విభేదించి గతేడాది సెప్టెంబర్‌లో తెగతెంపులు చేసుకున్న విషయం తెలిసింది. ఆ పార్టీ నేత హర్‌సిమ్రన్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి, రైతుల ఆందోళనకు మద్దతిచ్చారు. కానీ, ఇవేవీ ఆ పార్టీకి కలిసిరాలేదు. Also Read: ✦ ✦ ✦


By February 17, 2021 at 06:42PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-sweeps-punjab-local-body-polls-wins-7-out-of-8-municipal-corporations/articleshow/81062099.cms

No comments