Breaking News

భారత విమాన ప్రయాణాల విషయంలో సౌదీ అరేబియా సంచలన నిర్ణయం


భారత్ సహా 20 దేశాల నుంచి వచ్చే విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌదీ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ నిషేధం బుధవారం నుంచే అమల్లోకి వచ్చింది. విదేశాల నుంచి దౌత్యవేత్తలు, సౌదీ పౌరులు, వైద్య సిబ్బంది, వారి కుటుంబీకులు మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. సౌదీ తాత్కాలికంగా ప్రయాణాలు నిషేధించిన జాబితాలో భారత్‌ సహా లెబనాన్‌, టర్కీ, ఐర్లాండ్‌, ఇటలీ, పోర్చుగల్‌, స్వీడన్‌, స్విట్జర్లాండ్‌, యూకే, అర్జెంటీనా, జర్మనీ, జపాన్, బ్రెజిల్, ఇండోనేసియా, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్‌, యూఏఈ, ఫ్రాన్స్, యూఎస్ ఉన్నాయి. ఆ దేశాల్లో సౌదీకి రావడానికి రెండు వారాల ముందు పర్యటించినా అనుమతించబోమని తెలిపింది. అయితే, భారత్‌ నుంచి వచ్చే విమానాలను గతేడాది సెప్టెంబరులోనే సౌదీ నిషేధించింది. ప్రస్తుత నిషేధిత జాబితాలోని దేశాల సంఖ్య పెరిగింది. గతేడాది డిసెంబరులో విమానాల ప్రయాణాలను నిషేధించిన సౌదీ జనవరి 3 నుంచి తిరిగి పునరుద్ధరించింది. కానీ, కోవిడ్-19 కేసుల పెద్ద సంఖ్యలో నమోదుకావడంతో తిరిగి అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. యూరోపియన్ దేశాల నుంచి వచ్చిన వారు, కొత్త స్ట్రెయిన్ సోకిన దేశాల నుంచి వచ్చిన వ్యక్తులు రెండు వారాల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని సౌదీ అధికారులు గతంలోనే ఆదేశించారు. అంతేకాదు, మూడు నెలల కిందట ఐరోపా దేశాల్లో పర్యటించిన వారు కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని సౌదీ సర్కారు ఆదేశించింది. సౌదీలో ఓ పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అక్కడ 3.69 లక్షల మంది వైరస్ బారినపడగా.. 6,386 మంది ప్రాణాలు కోల్పోయారు.


By February 04, 2021 at 01:17PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/saudi-arabia-bans-flights-from-20-countries-including-india/articleshow/80684755.cms

No comments