Breaking News

భారత్ ఏ భూభాగాన్ని వదులుకోలేదు.. రాహుల్ విమర్శలపై రక్షణ శాఖ ప్రకటన


తూర్పు లడఖ్‌లో భారత్-చైనాల మధ్య తొమ్మిది నెలలుగా నెలకున్న ఉద్రిక్తతలపై ఇరు దేశాలూ ఓ అంగీకారానికి వచ్చి బలగాల ఉపసంహరణ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, ఈ అంశంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చైనాకు భారత భూభాగాన్ని అప్పగించిందని కాంగ్రెస్ నేత ఆరోపించారు. చైనాతో కుదిరిన ఒప్పందాన్ని ప్రశ్నించిన ఆయన... ఈ అంశంపై ప్రధాని ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ‘బేలగా’ పార్లమెంటులో ప్రకటన చేశారని ఎద్దేవా చేశారు. పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరంలోని ఫింగర్ 4 నుంచి ఫింగర్ 3కు భారత సైన్యం వెనక్కు వచ్చింది. వాస్తవానికి ఫింగర్-4 భారత భూభాగం.. మరి దానిని ప్రధాని చైనాకు ఎందుకు ఇచ్చారు? అని ప్రశ్నించారు. అయితే, రాహుల్ విమర్శలను కేంద్రం తిప్పికొట్టింది. చైనాకు ఏ భూభాగాన్ని భారత్‌ వదల్లేదని స్పష్టంచేసింది. అంతేకాదు, ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు పరిష్కారం కావాల్సి ఉందని పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన రక్షణ శాఖ.. భారత్, చైనాల మధ్య నెలకొన్న పరిస్థితులను వివరించింది. ‘సైన్యాల వెనక్కు మళ్లింపునకు సంబంధించి ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా భారత్‌ ఏ భూభాగాన్ని వదులుకోలేదు. దెస్పాంగ్, గోగ్రా వంటి వివాదాస్పద ప్రాంతాలకు సంబంధించి పరిష్కారించాల్సిన సమస్యలున్నాయి. పాంగాంగ్ సరస్సు వద్ద బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన 48 గంటలలోపు ఈ అంశాలపై దృష్టి సారించనున్నాం’ అని రక్షణ శాఖ పేర్కొంది. ‘ఫింగర్‌ 4 వరకే భారత భూభాగం ఉందనే వాదన తప్పు.. 1962 నుంచి 43వేల చదరపు కిలోమీటర్ల భూభాగం చైనా ఆక్రమణలో ఉంది. మా అవగాహన ప్రకారం ఫింగర్ 8 నుంచి వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెళ్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా ఫింగర్ 8 వరకు పెట్రోలింగ్‌ హక్కును నిలబెట్టుకుంది’ అని దానిలో స్పష్టం చేసింది. సరిహద్దులో భారత్ సాధించిన విజయాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్న వారు భద్రతాబలగాలను అగౌరవపరుస్తున్నారని నిందించింది. భారత సైనికులు ప్రస్తుతం ఫింగర్ 2, 3 మధ్య ఉన్న ధన్ సింగ్ థాపా పోస్టుకు దశలవారీగా వెనక్కి మళ్లుతున్నారు. అయితే ఏపీఎల్ఏ దళాలు ఫింగర్ 8కి తూర్పున ఉన్న పాత స్థానాలకు మళ్లుతున్నాయి. ఈ మధ్య 10 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని తాత్కాలికంగా నో-పెట్రోల్ ఏరియాగా గుర్తించనున్నారు. పాంగాంగ్ సరస్సు ఉత్తర ఒడ్డున భారత్, చైనా శాశ్వత పోస్టులు దీర్ఘకాలంగా స్థిరంగా ఉన్నట్టు రక్షణ శాఖ తెలిపింది. ‘ప్రస్తుత ఒప్పందం రెండు వైపులా సైన్యాల విస్తరణను నిలిపివేయడానికి, శాశ్వత పోస్టుల వద్ద నిరంతర విస్తరణకు సహకరిస్తుంది’అని తెలిపింది.


By February 13, 2021 at 07:12AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/defence-ministry-refutes-rahul-gandhi-charge-of-india-ceding-territory-to-china/articleshow/80890651.cms

No comments