Breaking News

తొలిసారి గల్వాన్ మృతుల వివరాలు వెల్లడించిన చైనా.. డ్రాగన్ లెక్క ఇదీ!


గల్వాన్ లోయ ఘర్షణల్లో చనిపోయిన తమ సైనికుల విషయమై చైనా ఎట్టకేలకు ఓ ప్రకటన చేసింది. ఈ ఘర్షణల్లో తమ సైనికులు ఐదుగురు చనిపోయారని ప్రకటించింది. గతేడాది జూన్‌లో తూర్పు లడఖ్ సరిహద్దుల్లోని గల్వాన్ లోయ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. అయితే, ఇంత వరకూ చైనా దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. చైనా వైపున 40 మంది వరకు చనిపోయినట్టు ఇటీవల రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా, కారాకోరం మౌంటెయిన్ రేంజ్‌కు చెందిన ఫ్రాంటియర్ ఆఫీసర్లు, సైనికులు మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు సెంట్రల్ మిలటరీ కమిషన్ ఆఫ్ చైనా (సీఎంసీ) ప్రకటించింది. సరిహద్దుల్లో గల్వాన్ లోయ వద్ద జూన్ 2020న భారత్‌తో జరిగిన ఘర్షణలో ఐదుగురు సైనికులు అమరులయ్యారని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ శుక్రవారం వెల్లడించింది. అమరులైనవారిలో జింగ్జియాంగ్ మిలటరీ కమాండ్‌కు చెందిన రెజిమెంటల్ కమాండర్ ఖై ఫ్యాబో ఉన్నారని పేర్కొంది. వీరికి యుద్ధ స్మారక అవార్డులను ప్రధానం చేసింది. ఖై ఫ్యాబోకి ‘హీరో రెజిమెంటల్ కమాండర్ ఫర్ డిఫెండింగ్ ది బోర్డర్’,చెన్ హంగ్‌జున్‌కి ‘హీరో టూ డిఫెండ్ ది బోర్డర్’, మిగతా ముగ్గురు సైనికులు జియాంగ్‌రోంగ్, జియో సియూన్, వాంగ్ జుహురన్‌లకు ఫస్ట్‌క్లాస్ మెరిట్ అవార్డులను ఇచ్చింది. సరిహద్దుల్లో తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన క్రమంగా వీడుతున్న వేళ గల్వాన్ లోయ ఘర్షణలో చనిపోయిన తమ సైనికుల సంఖ్యపై చైనా ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇరు దేశాలూ బలగాల ఉపసంహరణపై ఓ అంగీకారానికి వచ్చి, వివాదాస్పద ప్రాంతాల నుంచి వైదొలగుతున్న విషయం తెలిసిందే. పాంగాంగ్ సరస్సు ఉత్తరతీరం సహా పలు ప్రాంతాల నుంచి చైనా తన బలగాలను పూర్తిగా వెనక్కు మళ్లించినట్టు తాజాగా విడుదలైన శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. లడఖ్ రీజియన్‌లోని పాంగాంగ్ సరస్సు, గ్లేసియల్ లేక్ తీరం నుంచి సైన్యాలు, యుద్ధ ట్యాంకులు, ఇతర సైనిక యంత్రాగాన్ని చైనా తరలించినట్టు బుధవారం వెల్లడించిన ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టమవుతోంది. జనవరి చివరిన విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలు ఈ ప్రాంతాల్లో సీపీఎల్ఏ క్యాంప్‌లు ఉన్నట్టు స్పష్టం చేయగా.. ప్రస్తుతం వాటిని తొలగించారు. భారత్ వైపు నుంచి కూడా సైన్యం ఉపసంహరణ జరుగుతోంది.


By February 19, 2021 at 09:07AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/china-says-five-officers-soldiers-killed-in-galwan-clash-with-india/articleshow/81102555.cms

No comments