Breaking News

టైమ్ ఎమర్జింగ్ లీడర్స్‌లో ఆరుగురు భారతీయులు.. వీరిలో ఇద్దరు తెలుగువాళ్లు


టైమ్ మ్యాగజైన్ ఈ ఏటి మేటి 100 మంది ఎమర్జింగ్ లీడర్స్ జాబితాలో ఒక భారతీయుడు, ఐదుగురు భారత సంతతి వ్యక్తులకు చోటు దక్కింది. ‘టైమ్‌ అత్యంత ప్రభావశీలుర జాబితా 2021’లో భారత్ నుంచి భీమ్‌ ఆర్మీచీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ (34)ను ఎంపిక చేసింది. అలాగే ఇందులో చోటు దక్కిన ఐదుగురు భారత సంతతి వ్యక్తుల్లో ఇద్దరు తెలుగు వారు కావడం హర్షణీయం. సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌ అత్యున్నత న్యాయవాది విజయా గద్దె (46),‘అప్‌సాల్వ్‌’స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు రోహన్‌ పావులూరి(25) ఈ జాబితాలో ఉన్నారు. వీరి సహా ఐదుగురు భారత సంతతి వ్యక్తులను ‘టైమ్‌’ ఎంపిక చేసింది. భారత సంతతికి చెందిన బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషీ సునక్‌ (40), ఇన్‌స్టాకార్ట్‌ వ్యవస్థాపకుడు, సీఈవో అపూర్వ మెహతా(34), గెట్‌ అస్‌ పీపీఈ స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శిఖా గుప్తాలకు చోటు లభించింది. బ్రిటన్‌ క్యాబినెట్‌లో రిషి సునక్ తొలినాళ్లలో అనామక మంత్రిగా ఉన్నప్పటికీ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించి అభిమానపాత్రులయ్యారని మ్యాగజైన్‌ కొనియాడింది. పోల్‌స్టార్‌ ‘యూగవ్‌’ ప్రకారం బ్రిటన్‌ తదుపరి ప్రధాని సునక్‌ అని కొనియాడింది. కోవిడ్ -19 మహమ్మారిపై వేగంగా స్పందించిన ప్రభుత్వం ఉద్యోగాలు కోల్పోయిన చాలా మంది పౌరులకు చేయూతనిచ్చేలా నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొంది. కోవిడ్‌-19 ప్రాథమిక దశలో అపూర్వ మెహతా సారథ్యంలోని ఇన్‌స్టాకార్ట్‌కు ఆర్డర్లు వెల్లువెత్తాయని పేర్కొంది. చెల్లింపు విధానాలు, దుకాణదారుల కోసం తరచూ పాలనాపరమైన మార్పులు, పనితీరు కొలమానాలు వంటి కార్మికులతో వ్యవహరించిన విధానంపై కొన్ని విమర్శలను ఎదుర్కొన్నా వాటిని సమర్ధంగా తిప్పికొట్టారని తెలిపింది. ట్విటర్‌లో శక్తిమంతమైన అధికారుల్లో ఒకరిగా విజయా గద్దెను అభివర్ణించిన టైమ్స్‌.. క్యాపిటల్‌ హిల్‌పై దాడి తర్వాత ట్రంప్‌ ఖాతాను సస్పెండ్‌ చేయడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. చంద్రశేఖర్‌ ఆజాద్‌ దళితుల కోసం స్కూళ్లు నడుపుతున్నారని, కుల హింసకు వ్యతిరేకంగా గ్రామాల్లో పోరాటం చేస్తున్నారని ప్రశంసించింది. ‘ఈ జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరూ చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు.. వాస్తవానికి, చాలామంది ఇప్పటికే చరిత్ర లిఖించారు’ అని టైమ్ ఎడిటోరియల్ డైరెక్టర్ డాన్ మస్కయ్ అన్నారు.


By February 19, 2021 at 08:42AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/five-indian-origins-one-indian-feature-in-time-magazines-list-of-100-emerging-leaders/articleshow/81102242.cms

No comments