Breaking News

పాంగాంగ్ తీరంలో సైన్యాల ఉపసంహరణ పూర్తి.. రేపు కీలక చర్చలు


తూర్పు సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య గతేడాది మే మొదటి వారం నుంచి కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడుతోంది. తొమ్మిది నెలలుగా ఇరు దేశాలూ భారీగా సైనికులను మోహరించడంతో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఉద్రిక్తతలను తగ్గించి వివాదాస్పద ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కు మళ్లించాలని భారత్, చైనాలు ఓ అవగాహనకు వచ్చాయి. దీంతో తొలి దశ ఉపసంహరణ ప్రక్రియ గతవారం ప్రారంభమయ్యింది. ప్రస్తుతం ఉత్తర, దక్షిణ తీరాల్లో ఇరు దేశాలూ సైన్యాలను ఉపసంహరణించినట్టు విశ్వసనీయ వర్గాలు శుక్రవారం పేర్కొన్నాయి. బలగాల ఉపసంహరణలో భాగంగా భారత్, చైనాలు పదో దశ చర్చలు శనివారం జరగనున్నాయి. ఈ సమావేశంలో దెప్పాంగ్, హాట్‌ స్ప్రింగ్స్, గోగ్రా ప్రాంతాల నుంచి సైన్యాలు వెనక్కు మళ్లింపుపై చర్చించనున్నారు. సీనియర్ కమాండర్ స్థాయి అధికారుల మధ్య చర్చలు శనివారం జరగనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. శనివారం ఉదయం 10 గంటలకు పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరానికి సమీపంలోని చూషుల్-మోల్డో వద్ద జరగున్నాయని పేర్కొన్నారు. సుదీర్ఘ ప్రతిష్టంభనకు కారణమైన పాంగాంగ్ సరస్సు తీరంలో బలగాలు, యుద్ధ ట్యాంకులు, వాహనాలను ఇరు దేశాలూ ఉపసంహరించాయి. పాంగాంగ్ సరస్సు ఉత్తరతీరం సహా పలు ప్రాంతాల నుంచి చైనా తన బలగాలను పూర్తిగా వెనక్కు మళ్లించినట్టు తాజాగా విడుదలైన శాటిలైట్ చిత్రాలు వెల్లడించాయి. లడఖ్ రీజియన్‌లోని పాంగాంగ్ సరస్సు, గ్లేసియల్ లేక్ తీరం నుంచి సైన్యాలు, యుద్ధ ట్యాంకులు, ఇతర సైనిక యంత్రాగాన్ని చైనా తరలించినట్టు బుధవారం విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేశాయి. మరోవైపు, గల్వాన్ లోయ ఘర్షణల్లో జరిగిన ప్రాణనష్టంపై ఇంత వరకు నోరు విప్పని చైనా మృతుల సంఖ్యను అధికారికంగా శుక్రవారం ప్రకటించింది. గల్వాన్ లోయ వద్ద భారత సైన్యంతో జరిగిన ఘర్షణల్లో ఓ అధికారి సహా ఐదుగురు సైనికులు అమరులైనట్టు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. వీరందరికీ యుద్ధ అవార్డులను ప్రదానం చేసింది.


By February 19, 2021 at 02:00PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-china-disengagement-at-both-banks-of-pangong-completed-says-sources/articleshow/81106873.cms

No comments