Breaking News

మీటింగ్ ఉందని పిలిచి పార్లమెంట్‌లో మహిళపై అఘాయిత్యం.. ప్రధాని క్షమాపణ


పార్లమెంట్‌లోనే తనపై సహచరుడు అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆస్ట్రేలియా మహిళ చేసిన ఆరోపణలకు ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై క్షమాపణలు చెప్పిన మోరిసన్.. ప్రభుత్వ కార్యాలయంలో ఇటువంటి సంస్కృతిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. అధికార లిబరల్ పార్టీ కోసం పనిచేసే వ్యక్తి 2019 మార్చిలో తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని బాధిత యువతి ఆరోపించింది. రక్షణ శాఖ మంత్రి లిండా రెనాల్డ్స్ కార్యాలయంలోనే ఈ ఘోరం జరిగిందని పేర్కొంది. ఈ ఘటన గురించి 2019 ఏప్రిల్‌లోనే మీడియా ముందు వెల్లడించిన బాధితురాలు.. భవిష్యత్తు దృష్ట్యా దీనిపై అధికారికంగా ఫిర్యాదు చేయరాదని నిర్ణయించింది. ఇదిలా ఉండగా, 2019 ఏప్రిల్‌లో బాధితురాలితో మాట్లాడినట్లు పోలీసులు ప్రకటించారు. రెనాల్డ్స్ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అధికారి తనపై లైంగిక దాడి చేశాడని యువతి పేర్కొంది. ఆఫీసులో మీటింగ్ ఉందని నమ్మించి అక్కడకు వెళ్లిన తర్వాత తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపింది. ఈ విషయం గురించి గతేడాది తనకు ఫిర్యాదు చేసినట్టు రక్షణ మంత్రి సోమవారం ధ్రువీకరించారు. అయితే, పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఆమెను ఒత్తిడి చేసినట్టు వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఈ ఘటనపై మంగళవారం క్షమాపణలు చెప్పిన ప్రధాని.. విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఇటువంటి ఘటన జరిగుండాల్సింది కాదని వ్యాఖ్యానించారు. పనిచేసే చోట యువతులకు కార్యాలయాలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని మోరిసన్ వ్యాఖ్యానించారు. పనిచేసే చోట ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఫిర్యాదులను సమీక్షించేందుకు క్యాబినెట్ అధికారి స్టెఫానీ ఫోస్టర్‌ను నియమిస్తున్నట్టు తెలిపారు. లిబరల్ పార్టీలో మహిళ పట్ల అభ్యంతరంగా ప్రవర్తించారనే ఆరోపణల నేపథ్యంలో మోరిసన్‌ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. 2019లో అప్పటి ప్రధాని మాల్కం టర్న్‌బుల్‌ను బహిష్కరించే చర్యకు మద్దతు ఇచ్చినందుకు తాను బెదిరింపులను ఎదుర్కొన్నానని ఓ మహిళా సభ్యురాలు ఆరోపించారు. గతేడాది అప్పటి ఇమ్మిగ్రేషన్ మంత్రి అలాన్ టడ్జ్ తనను బెదిరించినట్టు అధికారిక ఫిర్యాదు చేశారు.


By February 16, 2021 at 12:21PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/australian-pm-morrison-apologises-after-woman-alleges-she-was-assaulted-in-parliament/articleshow/80971225.cms

No comments