Breaking News

చెన్నైలో కిడ్నాప్, మహారాష్ట్రలో హత్య.. ఆ ఐదు రోజులు ఏం జరిగింది: సెయిలర్ మర్డర్ మిస్టరీ


ఓ నేవీ అధికారిని తమిళనాడులో అపహరించి, మహారాష్ట్రలో హత్యచేసిన పాల్పడిన ఘటన మిస్టరీగా మారింది. ఝార్ఖండ్‌కు చెందిన నేవీ సెయిలర్‌ సూరజ్ కుమార్ దూబే తనను దుండగులు చెన్నై ఎయిర్‌పోర్ట్ బయట అపహరించి తమిళనాడులో మూడు రోజులు ఉంచి తర్వాత నిప్పంటించినట్టు వాంగ్మూలంలో తెలిపారు. అయితే, మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాకు ఎలా వచ్చిందీ మాత్రం దూబే సమాధానం ఇవ్వకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తనను జనవరి 30న అపహరించినట్టు దూబే చెప్పాడు. ఫిబ్రవరి 5న కాలిన గాయాలతో ఉన్న దూబేను గుర్తించి ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. అయితే, పోలీసులు మాత్రం దూబేను ఎవరూ కిడ్నాప్ చేయలేదని అంటున్నారు. అతడు ఓ హోటల్ నుంచి బయటొకెళ్లి వచ్చినట్టు పేర్కొన్నారు. ‘తాను రాంచీ నుంచి చైన్నైకు విమానంలో జనవరి 30న చేరుకున్నాను.. రాత్రి 9 గంటలకు చైన్నై చేరుకున్నాడు.. ఎయిర్‌పోర్ట్ బయట ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు గన్‌తో బెదిరించి డబ్బులు, మొబైల్ ఫోన్ లాక్కుని, తెల్లటి ఎస్‌యూవీలో బలవంతంగా ఎక్కించారు.. తనను విడుదల చేయాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు’ అని దూబే తన మరణ వాంగ్మూలంలో పేర్కొన్నారు. ‘జనవరి 1 నుంచి ఫిబ్రవరి 1 వరకు నెల రోజు సెలవులో ఉన్నాడు.. గన్‌తో బెదిరించి కిడ్నాప్ చేశారని, చెన్నైలో మూడు రోజులు ఉంచారని చెప్పాడు.. తర్వాత ఏం జరిగిందనే వివరాలను చెప్పలేదు.. ఫిబ్రవరి 5న తనపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు వాంగ్మూలంలో పేర్కొన్నాడు’ అని పాల్ఘర్ ఎస్పీ డీటీ షిండే వివరించారు. దూబే వాంగ్మూలం ఆధారంగా పోలీసులు హత్య కేసు నమోదు చేసి, 100 మందితో బృందాన్ని ఏర్పాటుచేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, దూబే కుటుంబానికి ఎటువంటి బెదిరింపు ఫోన్ రాలేదని విచారణలో తేలింది. ఎయిర్‌పోర్ట్ సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లోనూ అతడికి సంబంధించిన రికార్డులు కనిపించలేదు. సూరజ్ మూడు సిమ్‌లు వాడుతున్నట్టు గుర్తించారు. అయితే, కుటుంబసభ్యులకు మాత్రం అతడు రెండు నెంబర్లు వాడుతున్నట్టు మాత్రమే తెలుసు. మూడో సిమ్‌ను షేర్ మార్కెట్ బిజినెస్‌ కోసం వినియోగిస్తున్నట్టు పోలీసులు విచారణలో తేలింది. జనవరి 30 కిడ్నాపయినట్టు చెబుతున్నా ఫిబ్రవరి 1న అతడి ఖాతా నుంచి రూ.5,000 విత్ డ్రా అయినట్టు గుర్తించారు.


By February 09, 2021 at 09:28AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/kidnapped-in-chennai-burnt-in-maharashtra-mysterious-murder-of-jharkhand-navy-man/articleshow/80759457.cms

No comments