Breaking News

ఇంకెప్పుడు నేర్చుకుంటారు..? ఇలాంటివి ఎన్ని జరగాలంటూ యాంకర్ అనసూయ ఎమోషనల్ కామెంట్స్


ప్రకృతి ఒడిలో చల్లగా బ్రతకాల్సిన ప్రజలు ఒక్కోసారి అదే ప్రకృతి కోపానికి బలైపోతుంటారు. ప్రకృతి విపత్తులు ఎప్పుడు, ఏ రూపంలో వస్తాయనేది ఊహకు అందడం లేదు. దేశవిదేశాల్లో వరదలు, భూకంపాలు, మంచు చరియలు విరిగిపడటం లాంటి ఎన్నో విపత్తులు చోటుచేసుకోవడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అయితే వీటన్నింటికీ ముఖ్యకారణం అశేష మానవాళి ప్రకృతికి చేస్తున్న హాని మాత్రమే అంటున్నారు పర్యావరణ విశ్లేషకులు. తాజాగా ఇదే విషయాన్ని తనదైన కోణంలో చెబుతూ ఆవేదన చెందింది . రీసెంట్‌గా (ఈ ఆదివారం) ఉత్తరాఖండ్‌లో ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడిన ఘటన యావత్ భారత దేశాన్ని విషాదంలో ముంచేసింది. మంచు చరియలు విరిగిపడడంతో గంగానదికి ఉపనది అయిన ధౌలీగంగా నదికి వరద పోటెత్తడంతో అక్కడి వాతావరణంలో బీభత్సకర పరిస్థితులు కనిపించాయి. నదిపై నిర్మిస్తున్న పవర్‌ ప్రాజెక్టు ధ్వంసం కావడంతో పాటు ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు, సమీప ప్రజలు 170 మంది పైగా ఆ వరదలో కొట్టుకుపోయారు. ఊహించని ఈ ప్రకృతి విపత్తు ప్రాణ, ఆస్తి నష్టం కలిగించడమే గాక అక్కడి ప్రజలకు శోకం మిగిల్చింది. దీంతో ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చింది యాంకర్ అనసూయ. ''మరో ప్రకృతి విపత్తు చోటుచేసుకుంది. ప్రకృతిని కాపాడుతూ దాన్ని సంరక్షిస్తూ సహజీవనం చేయాల్సిన సమయం ఇకనైనా వస్తుందా? మనం గుణపాఠం నేర్చుకోవాలంటే ఇలాంటివి ఇంకెన్ని విపత్తులు చూడాలి?'' అంటూ ఆమె ట్వీట్ చేసింది. ప్రకృతి వైపరిత్యాలకు కారణమయ్యే కాలుష్యాన్ని నియంత్రిస్తూ ఆ ప్రకృతిని సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందనే కోణంలో అనసూయ ఈ కామెంట్స్ చేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బుల్లితెర, వెండితెర కెరీర్ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్న అనసూయ పలు టీవీ షోస్ చేస్తూనే సినిమా షూటింగుల్లో భాగమవుతోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగమార్తాండ' మూవీలో కీలకపాత్ర పోషిస్తున్న ఆమె ఇటీవలే రవితేజ 'ఖిలాడీ' సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే కార్తికేయ 'చావు కబురు చల్లగా' సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


By February 09, 2021 at 09:50AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anasuya-bharadwaj-reaction-on-uttarakhand-glacier-incident/articleshow/80759753.cms

No comments