Breaking News

మొదటికొచ్చిన ప్రతిష్టంభన: భారత్, చైనా పదో దశ చర్చలు విఫలం


తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన క్రమంగా వీడుతుందని భావించిన వేళ వివాదం మళ్లీ మొదటికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల్లో బలగాలను ఇరు దేశాలూ ఓ అంగీకారానికి వచ్చి వెనక్కు మళ్లించిన విషయం తెలిసిందే. అయితే, శనివారం జరిగిన భారత్‌, చైనా మధ్య పదో విడత కోర్‌‌ కమాండర్‌ స్థాయి చర్చల్లో ఎటువంటి పురోగతి లేదని తెలుస్తోంది. చైనా భూభాగంలోని మాల్దో స్థావరంలో శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ చర్చలు ఆదివారం తెల్లవారుజామున 2గంటల వరకు కొనసాగాయి. దాదాపు 16 గంటలసేపు ఇరు దేశాల కోరు కమాండర్ల మధ్య చర్చలు జరిగినా ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న దెప్సాంగ్‌, దెమ్‌చోక్, గోగ్రాహైట్స్‌, హాట్‌స్ప్రింగ్స్‌ వద్ద బలగాల ఉపసంహరణే ప్రధాన అజెండాగా ఈ చర్చలు జరిగాయి. కానీ, మరిన్ని చర్చల ద్వారా పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని ఇరు వర్గాలు పునరుద్ఘాటించాయి. ‘సరిహద్దు ప్రాంతాలలో శాంతి, ప్రశాంతతను సంయుక్తంగా నిర్వహించడానికి మిగతా సమస్యలను స్థిరంగా, క్రమబద్ధంగా పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ఇరుపక్షాలు పనిచేస్తాయి’ అయిన పదో దశ చర్చలు ముగిసిన తర్వాత భారత్ చైనా అధికారులు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇరు దేశాలూ తమ దేశాధినేతల ముఖ్యమైన అభిప్రాయాలను అనుసరించి, చర్చల ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులను స్థిరంగా ఉంచాలనే నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘హాట్ స్ప్రింగ్-గోగ్రాలోని పెట్రోలింగ్ పాయింట్స్ 15, 17ఏ వద్ద సైన్యాలను వెనక్కు మళ్లించడానికి ఇరువురూ అంగీకరించారు..కానీ, ఈ ప్రాంతానికి సమీపంలో ప్రత్యర్థి దళాల మోహరింపు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై నిర్దిష్ట ఒప్పందానికి రాలేదు.. మరికొన్ని చర్చలు అవసరం’ అని పేర్కొన్నాయి. వీటితోపాటు పాత వివాదాలు దెమ్‌చోక్ సెక్టార్‌లోని ట్రాక్ కూడలి చార్డింగ్ నింగ్‌లంగ్ నల్లాహ్ (సీఎన్ఎన్), దెప్పాంగ్ ప్లెయిన్స్‌ విషయమైన మరిన్ని చర్చలు అవసరమని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దెప్సాంగ్‌లో వాస్తవాధీన రేఖగా పరిగణిస్తున్న సంప్రదాయ పెట్రోలింగ్ పాయింట్స్ 10,11,11ఏ, 12, 13 వద్ద తమ దళాలను అడ్డుకోవడంపై పదో దశ చర్చల్లో భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘దెప్సాంగ్ వివాదం 2013 నుంచి నిరంతరాయంగా కొనసాగుతోంది. గత మేలో తూర్పు లడఖ్‌లో మొదలైన వివాదంతో దీనికి సంబంధం లేదు. అయితే, ఇది కూడా ప్రస్తుత చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది.. ముఖ్యంగా ఇది భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది’ అని వ్యాఖ్యానించాయి.


By February 22, 2021 at 07:12AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/marathon-military-talks-between-india-and-china-fail-to-end-lac-impasse/articleshow/81144401.cms

No comments