Breaking News

కొండెక్కిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ప్రజలకు ఊరటనిచ్చిన ఆ నాలుగు రాష్ట్రాలు


దేశంలో చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొండెక్కి పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రికార్డుస్థాయిలో పెరుగుతున్న ఇంధన ధరలు చూసి వాహనం బయటకు తీయాలంటేనే భయపడిపోతున్నారు. దాదాపు దేశవ్యాప్తంగా రూ.100 మార్క్‌కు దగ్గరగా ఉన్నాయి. కేంద్ర సుంకాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల వాతలతో సామాన్యుల నడ్డివిరుగుతోంది. వరుసగా 14 రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నా.. కేంద్రం చోద్యం చూస్తోందనే విమర్శలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోవాత నుంచి ప్రజలకు కొంత ఉపశమనం కలిగించడానికి నాలుగు రాష్ట్రాలు ముందుకొచ్చాయి. ఇంధనంపై విధిస్తున్న అదనపు పన్నులను కొంత మేర తగ్గిస్తూ ప్రజలకు ఊరట కలిగించే ప్రయత్నం చేశాయి. ఎన్నికలు జరగనున్న పశ్చిమ్ బెంగాల్‌లో అక్కడ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై రూ.1 వ్యాట్ తగ్గిస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. రాజస్థాన్ ప్రభుత్వం జనవరిలోనే చమురు ధరలపై వ్యాట్‌ను 38 శాతం నుంచి 36 శాతానికి తగ్గించింది. అటు అసోం కూడా కరోనా కారణంగా విధించిన అదనపు పన్ను రూ.5 తగ్గిస్తూ ఫిబ్రవరి 12న నిర్ణయం తీసుకుంది. మేఘాలయ ప్రభుత్వం ఇంధన ధరలను భారీగా తగ్గించి, ప్రజలకు ఉపశమనం కలిగింది. పెట్రోల్‌పై రూ.7.40, డీజిల్‌పై 7.10 మేర తగ్గించింది. అంతకు ముందు రాయితీ రూ.2 తగ్గించిన మేఘాలయ.. పెట్రోల్‌పై విధించిన 31.62 శాతం వ్యాట్‌ను 20 శాతానికి, డీజిల్‌పై 22.95 శాతం నుంచి 12 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక, గతేడాది మార్చి- మే మధ్య అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా.. భారత్ మాత్రం ఎక్సైజ్ సుంకం తగ్గించలేదు. ఆ సమయంలో లీటర్ పెట్రోల్‌పై రూ.13, డీజిల్‌పై రూ.16 పెరిగింది. డీజిల్ ధరలు పెరగడానికి లాక్‌డౌన్ కారణంగా చమురు దిగుమతులు నిలిచిపోవడమే కారణమని అప్పట్లో కేంద్రం ప్రకటించింది. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల కిందట మాట్లాడుతూ.. ఇది ధర్మసంకటమని, ఇంధన ధరల తగ్గింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్చించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. మరోవైపు, 2018 అక్టోబరు తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించిన దాఖలాలు లేవు. అప్పట్లో పెట్రోల్ రూ.80, డీజిల్ 77కు చేరడంతో ఎక్సైజ్ పన్ను తగ్గించాలని కేంద్రాన్ని చమురు సంస్థలు కోరాయి. దీంతో కేంద్రం రూ.1.50 మేర తగ్గించింది. మొత్తం 18 రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించి, ప్రజలకు ఊరట కలిగిస్తున్నాయి.


By February 22, 2021 at 07:46AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/centre-in-bind-but-four-states-offer-relief-as-fuels-on-fire/articleshow/81144611.cms

No comments