Breaking News

కరోనా కారణంగా ప్రభుత్వానికి ఆ రూ.12 కోట్లు చెల్లించలేం..పద్మనాభస్వామి ఆలయం


భద్రత, నిర్వహణ ఖర్చులకు సంబంధించి రూ.11.7 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించలేమని సుప్రీంకోర్టుకు అనంతపద్మనాభస్వామి ఆలయ తాత్కాలిక కమిటీ శుక్రవారం తెలియజేసింది. కారణంగా ఆలయ ఆదాయం తగ్గిపోవడం వల్లే ఈ మొత్తాన్ని చెల్లించలేకపోతున్నట్టు పేర్కొంది. అనంత పద్మనాభస్వామి ఆలయ వివాదంపై గతేడాది జులైలో తీర్పును వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం రెండు కమిటీలను నియమించిన విషయం తెలిసిందే. ఆలయ నిర్వహణ బాధ్యతలు ట్రావెన్‌కోర్ రాజ వంశానికి కట్టబెట్టిన న్యాయస్థానం.. త్రివేండ్రం జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలోనూ కమిటీని కూడా నియమించింది. ఇది, ప్రభుత్వానికి, రాజకుటుంబానికి మధ్యే మార్గంగా పనిచేస్తోంది. ఆలయ ఆదాయంపై కరోనా వైరస్ ప్రభావం గణనీయంగా ఉందని, విరాళాలు తగ్గిపోయాయని తెలిపింది. ఈ మొత్తాన్ని చెల్లించడానికి తమకు కొంత సమయం కావాలని కోరింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ఈ సమయంలో ఎటువంటి ఆదేశాలను జారీచేయలేమని పేర్కొంది. ఈ అభ్యర్థను కేరళ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఈ కేసుకు సంబంధించిన గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాలని ఆదేశించింది. ఆలయ ఆదాయ వ్యయాల ఖాతాల ఆడిటింగ్ సెప్టెంబరు మధ్యలో ప్రారంభించాలని ఈ మేరకు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఇందు మల్హోత్రాల ధర్మాసనం స్పష్టం చేసింది. పద్మనాభస్వామి ఆలయ పాలన బాధ్యతను రాజకుటుంబానికి అప్పగించడాన్ని గతేడాది జులైలో ఇచ్చిన తీర్పులోనే సుప్రీంకోర్టు సమర్ధించింది. ఆలయంపై రాజ కుటుంబం హక్కులు సరైనవేనని పేర్కొంది. ఈ వివాదంపై 2011 జనవరి 31న కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ట్రావెన్‌కోర్ రాజ వంశీయులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా వారికి తీర్పు అనుకూలంగా వచ్చింది. 1991లో ట్రావెన్‌కోర్ రాజ వంశం చివరి పాలకుడు చనిపోవడంతో వారికి అన్ని హక్కులు నిలిచిపోయాయని కేరళ హైకోర్టు వెలువరించిన తీర్పును రద్దుచేసింది. కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా గతేడాది మార్చి నుంచి ఆగస్టు 26 వరకు అనంతపద్మనాభస్వామి ఆలయం మూసివేశారు. తిరిగి ఆలయాన్ని తెరిచినా సిబ్బంది, పూజారులకు కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో అక్టోబరు 12న తిరిగి తాత్కాలికంగా మూసివేసి, శానిటైజేషన్ చేపట్టారు. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు.


By February 13, 2021 at 07:49AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kerala-anantha-padmanabhaswamy-temple-cites-coronavirus-says-cant-pay-11-7-crores-to-state/articleshow/80890821.cms

No comments