Breaking News

KPHB Murder: పండ్ల వ్యాపారి హత్య కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. రూ.10ల కోసం దారుణం


హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీకాలనీ పీఎస్ పరిధిలో ఈనెల 1న హత్యకు గురైన పండ్ల వ్యాపారిని కేసులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కేవలం రూ.10ల కోసమే అతడిని చంపేసినట్లు తేలడంతో పోలీసులే షాకయ్యారు. ఈ కేసులో మైనర్ సహా ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. కూకట్‌పల్లి ఏసీపీ పి.సురేందర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ నుంచి ఆరేళ్ల క్రితం వలస వచ్చిన మహ్మద్‌ షకీవ్‌అలీ అలియాస్‌ షకీబ్‌అలీ(34) కూకట్‌పల్లి తులసీనగర్‌ పరిధి కృష్ణవేణినగర్‌లో భార్యా పిల్లలతో నివాసముంటున్నాడు. ప్రగతినగర్‌ రోడ్డులోని అంబీర్‌ చెరువుకట్ట వద్ద తోపుడు బండిపై పండ్లు విక్రయిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే జనవరి 1న సాయంత్రం ఓ యువకుడు వచ్చి కిలో రూ.30కి ద్రాక్ష కొన్నాడు. అయితే రూ.20లే ఇచ్చి వెళ్లిపోతుండటంతో షకీబ్‌అలీ అతడితో వాదనకు దిగాడు. మాటామాటా పెరగడంతో ఫోన్‌ చేసి ఐదుగురు మిత్రులను రప్పించాడు. వీరంతా ఇనుప స్టాండ్‌తో షకీబ్‌అలీ కడుపులో బలంగా కొట్టి పారిపోయారు. స్థానికులు షకీబ్‌ అలీ‌ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మూడో తేదీన మృతిచెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎల్లమ్మబండకు చెందిన మెకానిక్‌ నసీం అలియాస్‌ అయాన్‌(19), మహ్మద్‌ సమీర్‌ ఖాద్రి అలియాస్‌ షేక్‌ సమీరుద్దీన్‌(20), సయ్యద్‌ అప్సర్‌(20), మహ్మద్‌ ఖలీద్‌(19), మహ్మద్‌ తన్వీర్‌(18)లను నిందితులుగా గుర్తించి గురువారం అరెస్ట్‌ చేశారు. ఏ2 నిందితుడు మైనర్‌ కావడంతో అతడిని జువైనల్‌ హోమ్‌కు తరలించారు.


By January 08, 2021 at 09:40AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/kphb-police-arrested-six-persons-in-the-murder-case-of-fruit-vendor/articleshow/80164576.cms

No comments