మెట్రో పార్కింగ్ కోసం చెట్ల కూల్చివేత: సుప్రీం సీరియస్..స్టే
మెట్రో కార్ పార్కింగ్ షెడ్ నిర్మాణం కోసం ముంబయిలోని ఆరే కాలనీలో చెట్ల నరికివేత అంశం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. దీనిపై సినీ, వ్యాపార ప్రముఖులు తీవ్రంగా మండిపడుతున్నారు. మెట్రో పార్కింగ్ లేకపోయినా ఫర్వాలేదు కానీ చెట్లను మాత్రం నరికేయవద్దని వేడుకున్నారు. మెట్రో నిర్ణయానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పర్యావరణవేత్తలు, హక్కుల కార్యకర్తలు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. శుక్రవారం అర్ధరాత్రి ఆరే కాలనీలో హైడ్రామా చోటుచేసుకుంది. చెట్ల కూల్చివేత విషయాన్ని తెలుసుకుని పర్యావరణవేత్తలు అక్కడకు చేరకుని ఆందోళన నిర్వహించి అడ్డుకున్నారు. తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి 29 మంది సామాజిక ఉద్యమకారులు అరెస్ట్ చేసి, నాన్-బెయిల్‌బుల్ కేసు నమోదుచేశారు. ఈ అంశంపై రిషవ్ రంజన్ అనే లా విద్యార్థి సుప్రీంకోర్టుకు లేఖ రాశాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన సర్వోన్నత న్యాయస్థానం.. కేసును సుమోటాగా స్వీకరించింది. కేసును తక్షణమే విచారణ చేపడతామని సుప్రీం తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచడం విశేషం. అంతేకాదు, విచారణకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటుచేసింది. సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం.. ఆరే కాలనీలో చెట్ల నరికివేతను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ అంశంపై పూర్తిస్థాయిలో విచారిస్తామన్న ధర్మాసనం.. తదుపరి విచారణను అక్టోబరు 21కి వాయిదా వేసింది. ఆరే కాలనీలో 2,700 చెట్లను కూల్చి, కార్ల పార్కింగ్ కోసం షెడ్ నిర్మించాలని ముంబై మెట్రో నిర్ణయించింది. మెట్రో నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు పర్యావరణ కార్యకర్తలు ముంబయి హైకోర్టును ఆశ్రయించారు. అయితే వీరి పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. కోర్టు నుంచి అనుమతి లభించడంతో శుక్రవారం అర్థరాత్రి మెట్రో సిబ్బంది చెట్లను కూల్చేందుకు ప్రయత్నించారు. దాదాపు 200 చెట్ల వరకు అధికారులు కూల్చివేయగా ఇదే సమయంలో భారీ ఎత్తున స్వచ్ఛంద, సామాజిక కార్యకర్తలు, పర్యావరణవేత్తలు అక్కడికి చేరుకొని నిరసన తెలిపారు. దీంతో సిబ్బంది వెనక్కి తగ్గి పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 29 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై నాన్-బెయిల్‌బుల్ కేసు నమోదుచేసి, అక్కడ 144 సెక్షన్ విధించారు.
By October 07, 2019 at 12:12PM
No comments