ఓటమిని ఒప్పుకోని ట్రంప్: ఆ ప్లాన్ గురించి టాప్ అధికారితో గంటసేపు ఫోన్ కాల్!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమిని ప్రస్తుత అధ్యక్షుడు ఇంకా అంగీకరించడంలేదా? న్యాయస్థానంలో చుక్కెదురైనా అధికార పీఠం నుంచి ఆయన దిగిపోవడానికి సిద్ధంగా లేరా? అధ్యక్ష పీఠాన్ని నిలుపుకోడానికి ఆయన ప్రయత్నాలు ఆపడం లేదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇందుకు జార్జియా కార్యదర్శితో ట్రంప్ శనివారం మాట్లాడిన ఫోన్ కాల్ నిదర్శనం. జార్జియా కార్యదర్శి, రిపబ్లికన్ బ్రాడ్ రాఫెన్స్‌పెర్గర్‌తో శనివారం ఒక గంట ఫోన్ కాల్‌లో మాట్లాడిన ట్రంప్.. తన ఓటమిని అధిగమించడానికి జార్జియాలో తగిన ఓట్లను పొందాలని కోరారు. ఈ ఫోన్ కాల్ వివరాలు ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్ట్‌కు లభించాయి. ఈ విషయంలో రాఫెన్స్‌పెర్గర్‌ను నయానో, భయానో ఒప్పించడానికి ప్రయత్నించారు. ఒకానొక దశలో రాఫెన్స్‌పెర్గర్‌ను తిట్టిన ట్రంప్..పొగడటానికి ప్రయత్నించాడు.. చర్య తీసుకోమని వేడుకున్నాడు.. అంతేకాదు తన వాదనలకు మద్దతు నిరాకరిస్తూ తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు. దీనికి స్పందించిన పెర్గన్.. ‘పెద్ద రిస్క్’ తీసుకుంటున్నారని హెచ్చరించాడు. అయితే రాఫెన్స్‌పెర్గర్, అతని కార్యాలయ జనరల్ కౌన్సిల్.. ట్రంప్ వాదనలను తిరస్కరించారు.. అధ్యక్షుడు బలహీనమైన కుట్ర సిద్ధాంతాలపై ఆధారపడుతున్నారని, అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ జార్జియాలో 11,779 ఓట్లతో సాధించిన విజయం న్యాయమైన, ఖచ్చితమైనదని వివరించారు. వారి వాదనలను ట్రంప్ తిరస్కరించారు. జార్జియా సహా అమెరికా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.. నా వాదన తప్పు కాదు, ఓట్లను తిరిగి లెక్కించాలి అని ట్రంప్ పేర్కొన్నారు. రాఫెన్స్‌పెర్గర్ స్పందిస్తూ: ‘సరే, మిస్టర్ ప్రెసిడెంట్, మీకు ఉన్న అతిపెద్ద సవాల్ మీ వద్ద ఉన్న డేటా తప్పు’ అన్నారు. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ.. ‘కాబట్టి చూడండి, నేను చేయాలనుకుంటున్నది ఇదే. 11,780 ఓట్లను పొందాలనుకుంటున్నాను, అలా అయితే విజయం నాదే.. ఒక ఎందుకంటే జార్జియాలో నేనే గెలిచాను’ అని వితండవాదన చేశారు. జార్జియాలో నేను ఓడిపోవడానికి అవకాశమే లేదు, వేలాది ఓట్లు నాకు వచ్చాయి అని తన వాదన సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్, కన్జర్వేటివ్ ప్రముఖ లాయర్ క్లెటా మిచెల్‌తో ట్రంప్ ఇదే విషయం మాట్లాడినట్టు బయటకు వచ్చింది. మిచెల్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. ‘గత రెండు నెలలుగా నిరాధారణ ప్రకటనలు చేశారు.. అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై పోరాటం ప్రయత్నాలతో పాల్గొన్న ప్రతిఒక్కరూ ఇదే మాట చెప్పారు.. మా సంఖ్య తప్పని నిరూపించే రికార్డులను మాకు చూపించండి’ అని వ్యాఖ్యానించారు. మెడోస్ వ్యాఖ్యలపై వైట్‌హౌస్, ట్రంప్ ప్రచార బృందం సహా రాఫెన్స్‌పెర్గర్ కార్యాలయం దీనిపై స్పందించడానికి నిరాకరించింది. తాను పెర్గర్‌తో మాట్లాడిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా ట్రంప్ వెల్లడించారు. ‘బ్యాలెట్స్ అండర్ టేబుల్' కుంభకోణం, బ్యాలెట్ విధ్వంసం, చనిపోయిన ఓటర్ల గురించి సమాధానం చెప్పడం లేదు. అతనికి ఎటువంటి ఆధారాలు లేవు!’ అన్నారు. దీనికి రాఫెన్స్‌పెర్గర్ స్పందిస్తూ..‘గౌరవప్రదమైన అధ్యక్షుడు ట్రంప్.. మీరు చెప్పేది నిజం కాదు’ అన్నారు. ఈ కాల్ డేటా బయటకు రావడంతో డెమొక్రాట్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అవమానకరమైన రీతిలో అమెరికా ప్రజాస్వామ్యంపై డోనాల్డ్ ట్రంప్ దాడి గురించి మొత్తం ఈ రికార్డింగ్ బయటపెట్టిందని బిడెన్ ప్రచార న్యాయవాది బాబ్ బాయర్ అన్నారు.
By January 04, 2021 at 09:43AM
No comments