Breaking News

కరోనా వేళ బర్డ్‌ఫ్లూ కలకలం.. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో ప్రమాద ఘంటికలు


ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారితో సతమతవుతున్న వేళ.. దేశంలో మరోసారి కలకలం రేగుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో బర్డ్‌ఫ్లూ వైరస్‌ విజృంభిస్తోంది. బర్డ్‌ఫ్లూతో వందలాది కాకులు మృత్యువాతపడుతున్నాయి. ఆదివారం జైపూర్‌లోని జలమహల్‌ సమీపంలో 7 కాకులు చనిపోవడంతో ఇప్పటి వరకు అక్కడ బర్డ్‌ఫ్లూతో మృతి చెందిన కాకుల సంఖ్య 252కి చేరింది. వరుసగా కాకులు మృత్యువాత పడటంతో రాజస్థాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పశుసంవర్ధకశాఖ ముఖ్య కార్యదర్శి కుంజి‌లాల్‌ మీనా తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, వివిధ పక్షి సంరక్షణ కేంద్రాలు, కోళ్లఫారమ్‌ యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోట, ఝలవార్‌, బరన్‌, జోద్‌పూర్‌ డివిజన్లలో ఎక్కువగా మరణాలు చోటుచేసుకుంటున్నాయని, పెంపుడు జంతువులకు ఈ వైరస్‌ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సంబార్‌ సరస్సు, కైలా దేవి పక్షి సంరక్షణ కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. డిసెంబరు 25న ఝలవార్‌లో అనుమానాస్పదరీతిలో కాకులు చనిపోవడంతో నమూనాలను సేకరించి, పరీక్షలు నిర్వహించడంతో బర్డ్‌ఫ్లూ‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు ఝలవార్‌లో 100, బరన్‌లో 72, కోటాలో 47, పాలిలో 19, జోద్‌పూర్‌లో 7 కాకులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని చెప్పారు. అటు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోనూ 50 కాకులు బర్డ్‌ ఫ్లూతో చనిపోయాయి. దీంతో రాష్ట్ర అధికారులు అప్రమత్తమయ్యారు. బర్డ్‌ఫ్లూ ఉన్నట్లు అనుమానించి ఆయా ప్రాంతాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్‌లో పోంగ్‌ దాం సరస్సు (మహారాణా ప్రతాప్‌ సాగర్‌) లోనూ 1,000 వలస పక్షులు మృతి చెందాయి. కారణమెంటో తెలీకుండా అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో పక్షుల చనిపోవడం.. వాటిలో అంతరించే దశలో ఉన్న పక్షులు కూడా ఉన్నాయి. వారం రోజుల కిందట పాంగ్ చిత్తడి నేలలో వాటి కళేబరాలను జీవశాస్త్రవేత్తలు గుర్తించారు. అంతరించే దశలో ఉన్న బాతు వలే కనిపించే బార్ హెడెడ్‌ గూస్ 1000కిపైగా మరణించడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే చనిపోవడానికి ముందు అవి వింతగా ప్రవర్తించాయని చెప్తున్నారు. ఈ గూస్‌తో పాటు షోవెలెర్, రివర్ టర్న్, బ్లాక్‌ హెడెడ్‌ గల్‌, కామన్ టీల్ వంటివి కూడా ఉన్నాయని తెలిపారు. ఇవి కూడా బర్డ్‌ ఫ్లూతోనే చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వాటి మృతికి గల కారణాన్ని నిర్ధారించడానికి ఆ పక్షుల శాంపిళ్లను బరేలీలోని భారతీయ పశుచికిత్స పరిశోధన సంస్థ, జలంధర్‌లోని ప్రాంతీయ వ్యాధి నిర్ధారక ల్యాబరేటరీ, డెహ్రాడూన్‌లోని భారత వన్యప్రాణి సంస్థకు పంపించామని, వాటి ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.


By January 04, 2021 at 07:44AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bird-flu-alert-in-madhya-pradesh-and-rajasthan-more-than-300-crows-found-dead/articleshow/80089533.cms

No comments