యూకే స్ట్రెయిన్‌ను వేరుచేసిన భారత్.. కొత్త కరోనాను వృద్ధిచేసిన తొలి దేశంగా గుర్తింపు
యునైటెడ్ కింగ్‌డమ్‌లో విజృంభిస్తోన్న కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్‌ను ప్రయోగశాలలో విజయవంతంగా వృద్ధిచేసినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) శనివారం వెల్లడించింది. ప్రపంచంలో ఇప్పటివరకు మరే దేశమూ యూకే స్ట్రెయిన్‌ను (వేరియంట్) వేరుచేయలేదని, వృద్ధి చేయలేదని తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఐసీఎంఆర్ పేర్కొంది. ‘యూకే నుంచి భారత్‌కు తిరిగివచ్చిన వ్యక్తుల నుంచి సేకరించిన నమూనాల ఆధారంగా నేషనల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌ఐవీ)లో కొత్త వైరస్‌ను విజయవంతంగా వేరుచేశాం. వృద్ధి చేశాం’అని వివరించింది. ఇందుకోసం ఐసీఎంఆర్-ఎన్‌ఐవీ శాస్త్రవేత్తలు వెరో సెల్ లైన్స్‌ని ఉపయోగించినట్లు తెలిపింది. యూకే స్ట్రెయిన్ 70 శాతం వేగంగా వ్యాప్తిచెందుతున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు దేశంలో 29 మందిలో ఈ స్ట్రెయిన్ గుర్తించారు. మహమ్మారి ఇప్పటికే 30 దేశాలకు పాకిపోయింది. తొలి వైరస్ కంటే వేగంగా వ్యాపించడంతో ప్రపంచ దేశాలు మరోసారి కలవరానికి గురవుతున్నాయి. రోజుకో దేశంలో ఈ రకం వెలుగులోకి వస్తూనే ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగానే.. కొత్త వైరస్ కమ్ముకొస్తోంది. దీంతో దాదాపు అన్ని దేశాలు పటిష్ఠ చర్యలు చేపడుతున్నాయి. వియత్నాంలో శనివారం తొలి కేసు నిర్ధారణ అయ్యింది. ఇటీవల యూకే నుంచి తిరిగొచ్చిన ఓ మహిళలో ఈ కొత్త రకం స్ట్రెయిన్‌ను గుర్తించారు. దీంతో ఆమెను వెంటనే ఐసోలేషన్‌కు తరలించారు. వియత్నాం ఇప్పటికే అన్ని అంతర్జాతీయ విమాన రాకపోకల్ని నిషేధించింది. శుక్రవారం టర్కీలో ఏకంగా 15 మంది ఈ స్ట్రెయిన్ బారినపడ్డారు. వీరంతా యూకే నుంచి తిరిగొచ్చిన వారిగా గుర్తించారు.
By January 03, 2021 at 12:27PM
No comments