Breaking News

నేత ఇంటి ముందు పేడ.. ట్రాక్టర్ ట్రాలీతో డంప్, అంత కోపం ఎందుకంటే?


రాజకీయ నాయుకుడి ఇంటి ముందు డంప్ చేసి వెళ్లిపోయారు. అది కూడా ట్రాక్టర్‌ ట్రాలీతో.. తెల్లారి లేచేసరికి వాకిలి నిండా పేడ చూసి ఆ నేత కుటుంబసభ్యులు షాక్ తిన్నారు. పంజాబ్‌లోని హోషియార్పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ నేత మీద అంత కోపం ఎందుకంటారా? వ్యక్తిగతంగా కక్ష ఏమీ లేదు. ఆ పని చేసిన వారు రైతులు. ఆయన బీజేపీ నేత. ఇంకేం.. విషయం అర్థమైందిగా... కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు 38 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. కేంద్రం ఇప్పటివరకు రైతు సంఘాల ప్రతినిధులతో ఆరు దఫాలుగా చర్చలు జరిపింది. అయినా.. చర్చలు కొలిక్కి రాలేదు. జనవరి 4న మరో దఫా చర్చలకు ఆహ్వానించింది. ఈసారి పరిష్కారం లభించకుంటే పోరాటాన్ని తీవ్రం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. జనవరి 26న ఢిల్లీలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా.. పంజాబ్‌లోని హోషియార్పూర్‌లో కొంత మంది రైతులు మాజీ మంత్రి తీక్షణ్ సూద్ ఇంటి ముందు ట్రాక్టర్‌తో పేడ డంప్ చేశారు. తమ ఆందోళనలో భాగంగా వారు ఈ చర్యకు పూనుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఆందోళనకారులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవద్దని.. హింసాత్మక, రెచ్చగొట్టే ఘటనలకు పాల్పడవద్దని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పిలుపునిచ్చిన గంటల వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. రైతులు శాంతియుతంగా తమ నిరసన కార్యక్రమాలు చేసుకోవాలని ఆయన సూచించారు. ‘రోజుల తరబడి ఆందోళన నిర్వహిస్తుండటంతో కొంత మంది సహనం కోల్పోతున్నారు. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడతున్నారు. అలా చేస్తే పంజాబ్‌లో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది. రైతులు తమ పోరాటాన్ని శాంతియుతంగా కొనసాగించాలి’ అని సీఎం అమరీందర్ సింగ్ పిలుపునిచ్చారు. రైతుల చర్యను బీజేపీ నేతలు ఖండించారు. తీక్షణ్ సూద్ అనుచరులు, బీజేపీ అభిమానులు హోషియార్పూర్‌లో ధర్నా నిర్వహించారు. పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు అశ్వనీ కుమార్ శర్మ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


By January 02, 2021 at 03:47PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/farmers-dump-cow-dung-with-tractor-trolley-at-bjp-leader-house-in-punjab/articleshow/80072288.cms

No comments