Breaking News

మూడు టీకాలే ప్రభావవంతమైనవి.. మిగతావన్నీ మంచి నీళ్లే: పూనావాలా వివాదాస్పద వ్యాఖ్యలు


దేశంలో భారత్ బయోటెక్ (కొవాగ్జిన్), ఆక్స్‌ఫర్డ్ (కొవిషీల్డ) టీకాల అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతిచ్చిన విషయం తెలిసిందే. భారత్‌లో ఆక్స్‌ఫర్డ్ టీకా క్లినికల్ ట్రయల్స్, ఉత్పత్తి పుణేకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీకాల సామర్ధ్యం, ప్రభావశీలతపై ఆ సంస్థ సీఈఓ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ప్రపంచంలో ప్రస్తుతానికి మూడు వ్యాక్సిన్లు మాత్రమే ప్రభావశీలతను నిరూపించుకున్నాయని వ్యాఖ్యలు చేశారు. ఫైజర్‌-బయోఎన్‌టెక్, మోడెర్నా, ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకాలు మాత్రమే ప్రభావశీలతతో పనిచేస్తున్నట్లు నిరూపితమైందని, మిగతావి నీళ్లలా సురక్షితమైనవని వ్యాఖ్యానించారు. ప్రభావశీలతను ప్రామాణికంగా తీసుకొని ఒక టీకా 70 శాతం, 90 శాతం, 80 శాతం.. ఎంతమేర పనిచేస్తుందో నిర్ధారిస్తారన్న పూనావాలా... ఇది కేవలం ఆ మూడు టీకాల్లోనే నిరూపితమైందని వివరించారు. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు డీసీజీఐ అత్యవసర వినియోగ అనుమతులను మంజూరు చేయడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. కొవాగ్జిన్‌ను వాటర్‌ బాటిల్‌ ధర కన్నా తక్కువకే అందజేస్తామని భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లా ప్రకటించిన నేపథ్యంలో.. తాము కూడా కొవిషీల్డ్‌ ఒక డోసును రూ.200కే ప్రభుత్వానికి విక్రయిస్తామని ఆయన ప్రకటించారు. ప్రైవేటులో డోసు ధర రూ.1,000దాకా ఉంటుందన్నారు. టీకాల విక్రయంపై కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కోసం ఎదురుచూస్తున్నట్లు పూనావాలా వెల్లడించారు. వారం, పది రోజుల్లోగా కొవిషీల్డ్‌ టీకాల తరలింపు ప్రక్రియను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రవాణా సమస్యలతో తొలివిడత టీకాల తరలింపులో జాప్యం జరుగుతోందని, ఒకసారి ప్రారంభమయ్యాక వేగవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాలు ఏర్పాటు చేసుకునే వ్యాక్సిన్‌ స్టోరేజీలకు డోసులను చేరవేసే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. ఇప్పటికే 5 కోట్ల డోస్‌లను సిద్ధంగా ఉన్నాయని, మరో నెలన్నరలోగా 8 కోట్ల డోస్‌లను అందుబాటులోకి తెస్తామని వివరించారు. ముందస్తుగా 5 కోట్ల డోసులను ఉత్పత్తి చేసి ఉంచినందుకు ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. తొలి దశలో ప్రభుత్వం నిర్దేశించిన 50-60 మిలియన్ల వ్యాక్సిన్ల ఉత్పత్తి పూర్తయిన తర్వాత మార్చి తొలినాళ్లలోనే ప్రయివేట్ మార్కెట్‌లోకి టీకాను అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రస్తుతం నెలకు సగటున 6 కోట్ల టీకా డోసులను ఉత్పత్తి చేస్తున్నామని, మార్చి నాటికి 10 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పూనావాలా చెప్పారు. ప్రతి నిమిషానికి 5 వేల డోసులను ఉత్పత్తి చేసే సామర్థ్యం సీరం ఇన్‌స్టిట్యూట్‌ సొంతమని, బంగ్లాదేశ్‌, సౌదీ అరేబియా సహా మరో 66 దేశాలతో టీకా సరఫరాకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలిపారు. దేశంలో తొలి దశ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత వాటికి టీకాలను ఎగుమతి చేస్తామని పూనావాలా పేర్కొన్నారు.


By January 04, 2021 at 07:10AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/serum-institute-of-india-ceo-adar-poonawalla-controversal-comments-on-vaccines-efficacy/articleshow/80089308.cms

No comments