Breaking News

చైనా కొరివితో తలగోక్కున్న ప్రపంచ కుబేరుడు.. రెండు నెలలుగా అదృశ్యం


ప్రపంచ కుబేరుల్లో ఒకరు, చైనా వాణిజ్య దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకుడు అదృశ్యమైనట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. రెండు నెలలుగా ఆయన బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండటంతో అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. చైనా ప్రభుత్వానికి సలహాలివ్వబోయి ఆయన కోరి కష్టాలను కొనితెచ్చుకున్నారు. ప్రభుత్వంతో వివాదం నడుస్తున్న సమయంలో ఆయన మిస్సింగ్ అంశం అనేక అనుమానాలకు తావిస్తోంది. రెండు నెలల కిందట చైనా ప్రభుత్వానికి జాక్ మా సలహాలు ఇవ్వబోయి వారి ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత నవంబరులో తాను నిర్వహిస్తున్న టాలెంట్‌ షో ‘ఆఫ్రికాస్‌ బిజినెస్‌ హీరోస్‌’తుది ఎపిసోడ్‌కు జాక్ మా న్యాయమూర్తిగా వ్యవహరించాల్సి ఉండగా.. హాజరుకాలేదు. ఆయన స్థానంలో అలీబాబా ఎగ్జిక్యూటివ్‌ న్యాయమూర్తిగా వ్యవహరించారు. అంతేకాదు, ఆ షో వెబ్‌సైట్‌ నుంచి జాక్ మా ఫొటోలను తొలగించినట్లు టెలిగ్రాఫ్‌ పత్రిక ఓ కథనం ప్రచురించింది. ఆ తర్వాత నుంచి జాక్‌ మా బయటి ప్రపంచానికి కనబడలేదు. దీంతో ఆయన ఎక్కడున్నారన్నది మిస్టరీగా మారింది. అయితే, షెడ్యూల్‌ వివాదం కారణంగా ఫైనల్‌ ఎపిసోడ్‌కు జాక్‌ మా రాలేదని అలీబాబా అధికారి ప్రతినిధి తెలిపారు. గతేడాది అక్టోబరు 24న చైనాలో జరిగిన ఓ కార్యక్రమంలో జాక్‌ మా ప్రసంగిస్తూ చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపారు. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలని ఆయన హితవు పలికారు. చైనా ఆర్థిక, నియంత్రణ వ్యవస్థ ఆవిష్కరణలను అరికట్టాయని ఆరోపించిన జాక్ మా.. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మరిన్ని చిన్న సంస్థలు, వ్యక్తులకు ఆర్థిక సేవల విస్తరణను పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు. దీంతో చైనా ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనపై ప్రతీకార చర్యలకు ఉపక్రమించింది. ఆయన వ్యాపారాలపై నియంత్రణ సంస్థలతో నిఘా పెట్టి, దేశం విడిచి వెళ్లరాదని సూచించింది అలీబాబా అనుబంధ సంస్థ యాంట్‌ ఫైనాన్షియల్‌ ఐపీవోను కూడా అడ్డుకొంది. దీంతో ఆలీబాబా గ్రూప్‌‌తో పాటు జాక్‌ మా ఆస్తులు కూడా మంచులా కరిగిపోయాయి. ఇలాంటి సమయంలో రెండు నెలలుగా బాహ్య ప్రపంచంలోకి రాకపోవడం చర్చ జరుగుతోంది.


By January 04, 2021 at 02:04PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/chinese-billionaire-alibaba-founder-jack-ma-suspected-missing/articleshow/80094722.cms

No comments