Breaking News

దేశవ్యాప్తంగా కఠినమైన నిరవధిక లాక్‌డౌన్.. బ్రిటన్ ప్రధాని సంచలన నిర్ణయం


కొత్తరకం కరోనా స్ట్రెయిన్ విజృంభణ కొనసాగుతుండటంతో యునైటెడ్ కింగ్‌డమ్‌లో మరోసారి లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ సోమవారం ప్రకటించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కీలక దశకు చేరుకునే ముందు కరోనా మహమ్మారి ఆరోగ్య వ్యవస్థను దెబ్బతీస్తోందని ఈ సందర్భంగా జాన్సన్ వ్యాఖ్యానించారు. శరవేగంగా వ్యాప్తిచెందుతున్న కొత్తరకం స్ట్రెయిన్‌ను నియంత్రించడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నారు. కోవిడ్ నుంచి ఆస్పత్రులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని, దేశంలో మహమ్మారి మొదలైన తర్వాత ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి ఎదురుకాలేదని జాన్సన్ అభిప్రాయపడ్డారు. ‘దేశంలోని చాలా ప్రాంతం ఇప్పటికే కఠిన ఆంక్షల్లో ఉంది.. ఈ కొత్త వేరియంట్‌ను అదుపులోకి తీసుకురావడానికి మనం మరింత కలిసి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టమైంది’అని జాన్సన్ అన్నారు. కొత్త వేరియంట్‌‌ను నియంత్రించడం అత్యంత క్లిష్టమని, అందుకే దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు వెళ్లాల్సి వస్తోంది.. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ఆదేశాలు జారీచేస్తున్నామన్నారు. పాఠశాలలను మంగళవారం నుంచి మూసివేస్తున్నామని, నిత్యావసరాల దుకాణాలు, అత్యవసర విభాగాలు మాత్రమే పనిచేస్తాయని అన్నారు. టైమ్ టేబుల్ ప్రకారం టీకా కార్యక్రమం అనుకున్నట్లుగా జరిగి, కేసులు, మరణాల సంఖ్య ఊహించిన విధంగా తగ్గితే ఫిబ్రవరి మధ్య నాటికి లాక్‌డౌన్ నుంచి క్రమంగా బయటపడొచ్చని ఆయన అన్నారు. ప్రపంచంలోని అత్యధిక కరోనా మరణాలు చోటుచేసుకున్న దేశాల జాబితాలో ఆరో స్థానంలో ఉన్న బ్రిటన్.. కొత్త స్ట్రెయిన్‌తో సతమతవుతోంది. కోవిడ్ కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పుడు 21 రోజుల్లో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని బ్రిటన్ వైద్య నిపుణులు తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగానే రోజువారీ కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. సోమవారం అత్యధికంగా 58,784 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు 75 వేల మంది కరోనాకు బలయ్యారు.


By January 05, 2021 at 07:19AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/united-kingdom-goes-into-new-covid-19-lockdown-as-cases-surge/articleshow/80107105.cms

No comments