Breaking News

నేను చనిపోతే మృతదేహాన్ని సింహాలకు ఆహారంగా వేయండి.. వింత కోరిక బయటపెట్టిన నటుడు


తమ మరణానంతరం అవయవాలను దానం చేయడం లేదా పార్దీవదేహాలను పరిశోధనల కోసం అప్పగించాలని సమాజ సేవకులు కోరుకుంటారు. కానీ, బ్రిటన్‌కు చెందిన ఓ నటుడు మాత్రం తాను చనిపోతే తన మృతదేహాన్ని జూలో సింహాలకు ఆహారంగా ఉపయోగించాలని కోరుతున్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చెప్పిన విషయంపై సింహాలకు ప్రసిద్ధిగాంచిన లండన్‌ జూ స్పందించింది. హాస్యనటుడు, నిర్మాత, దర్శకుడు రికీ జెర్వీస్‌ గతవారం ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించాడు. మీరు చనిపోయిన తర్వాత మీ మృతదేహాన్ని ఏం చేయాలని కోరుకుంటున్నారు? అని యాంకర్ ప్రశ్నించగా.. మృతదేహాన్ని లండన్‌ జూలో ఉన్న సింహాలకు ఆహారంగా అందించేయాలని సమాధానం ఇచ్చారు. తాను చనిపోయిన తర్వాత తన శరీరం కనీసం అలాగైనా ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. అంతేకాదు ఈ మాటలకు వివరణ ఇచ్చిన జెర్వీస్.. ‘ప్రపంచం నుంచి మనం అన్ని తీసుకుంటున్నామని, స్వేచ్ఛగా తిరిగే జంతువులను తింటూ, అడవులను నరికేస్తున్నామన్నారు. అన్నింటినీ నాశనం చేస్తూ తిరిగి ఏమీ ఇవ్వడం లేదు.. అందుకే సింహాలకు ఆహారంగానైనా ఉపయోగపడాలని అన్నారు. తన మృతదేహాన్ని సింహాలు తింటుంటే.. జూకు వచ్చే సందర్శకుల ముఖాల్లో భావాలను చూడాలని ఉందన్నాడు. అయితే, రికీ కోరికను లండన్‌ జూ తిరస్కరించింది. ఆయనను తినడానికి మా జూలోని సింహాలకు కష్టంగా ఉండొచ్చని ఓ అధికారి చమత్కరించాడు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం జూ నిర్వహణ కష్టంగా మారిందని, ఎవరైనా ఏదైనా తిరిగి ఇవ్వాలనుకుంటే విరాళల రూపంలో ఇవ్వాలని కోరాడు. వచ్చే విరాళాలతో జూలోని సింహాలకు ఆహారం అందిస్తామని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. జెర్వీస్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఒకసారి ఆయన ఫేస్‌బుక్‌లో ఈ విధంగా మాట్లాడిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. జంతువుల ఆహార ఉత్పత్తులపై మానవుడు ఆధారపడటం వల్ల మనకు కరోనా వైరస్ ముప్పు ఏర్పడిందన్నారు. ‘అయితే ఇది మళ్లీ జరుగుతుంది. జంతు ఉత్పత్తుల మార్కెట్లు ఇప్పటికే తెరుచుకుంటున్నాయి. అవి అప్పటికే తిరిగి వస్తున్నాయి. మెర్స్, సార్స్ మొదట గబ్బిలాల నుంచి వచ్చాయి’ అని ఆ వీడియోలో చెప్పాడు. ‘మనం చేయకూడని పనులు చేయడం.. వస్తువులను తింటున్నామని వ్యాఖ్యానించాడు.


By January 16, 2021 at 08:28AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/britian-actor-ricky-gervais-wants-lions-to-eat-his-body-to-give-something-back-to-animals/articleshow/80296519.cms

No comments