Breaking News

‘లైగర్’గా విజయ్ దేవరకొండ.. సాలా క్రాస్‌బ్రీడ్.. మ్యాడ్‌నెస్ గ్యారంటీ!


‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషనల్ స్టార్‌గా మారిన సినిమా సినిమాకు తన ఇమేజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళలోనూ అభిమానులు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ సౌత్ హీరో బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ పాన్ ఇండియా మూవీ రూపుదిద్దుకుంటోంది. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ యాక్షన్ డ్రామా టైటిల్‌పై ఇప్పటికే బోలెడన్ని రూమర్లు వచ్చాయి. ఫైటర్, లైగర్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని ఎప్పటి నుంచో అంటున్నారు. మొత్తానికి ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ సినిమాకు ‘లైగర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘సాలా క్రాస్‌బ్రీడ్’ అనేది ట్యాగ్‌లైన్. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ పొడవాటి కురులతో చేతికి గ్లోవ్స్ ధరించి గర్జిస్తూ కనిపించారు. ఆయన వెనుక సింహం, పులి ముఖాలను సగం సగం ఉంచారు. ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ తెలిసిన ఫైటర్‌గా విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ట్విట్టర్ ద్వారా పంచుకున్న విజయ్ దేవరకొండ.. నేషన్ వైడ్ మ్యాడ్‌నెస్ గ్యారంటీ అని హామీ ఇచ్చారు. కాగా, ఒక మగ సింహాం, ఆడ పులి కలయికతో జన్మించిన హైబ్రిడ్ జంతువు లైగర్. ఇప్పుడు ఈ టైటిల్‌ను విజయ్ దేవరకొండ సినిమాకు పెట్టడం ఆసక్తిగా మారింది. పూరి జగన్నాథ్ తన సినిమాలోని హీరోలను డిఫరెంట్ మ్యానరిజంతో చూపిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. మరోవైపు, విజయ్ దేవరకొండ కూడా మిగిలిన హీరోలకు కాస్త విరుద్ధం. అలాంటిది, ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ అంటే కచ్చితంగా సమ్‌థింగ్ స్పెషలే. విజయ్ దేవరకొండను గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ సినిమాలో పూరి చూపించబోతున్నారట. కరణ్ జోహార్ లాంటి భారీ చిత్రాల నిర్మాత ఈ ప్రాజెక్ట్‌లోకి రావడంతో బాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. రోనిత్ రాయ్, విష్ణు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్నారు.


By January 18, 2021 at 12:10PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/vijay-deverakonda-pan-india-film-with-puri-jagannadh-titled-liger/articleshow/80324084.cms

No comments