Breaking News

జాతీయ ఓటరు దినోత్సవం.. రాష్ట్రపతి చేతుల మీదుగా ‘హలో ఓటర్’ కార్యక్రమం


ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది.. ఐదేళ్లకు ఒకసారి పాలకులను ప్రజలే స్వయంగా ఎన్నుకుంటారు. అందుకే దేశంలో ఓటరుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. తన ఓటు హక్కుతో నచ్చినవారిని అందలం ఎక్కించగలరు.. నచ్చకపోతే పదవిలో నుంచి దింపేయగలరు. ఎంతో విలువైన ఈ ఓటు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు అనే బ్రహ్మాస్త్రంతో శాసించగలిగే హక్కును మన రాజ్యాంగం కల్పించింది. ఎంతో విలువైన ఓటుహక్కును అందరికీ కల్పించేందుకు గాను ఏటా కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేస్తూ.. ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతోంది. అయితే, భారత ఎన్నికల సంఘం ఆవిర్భవించిన రోజైన 1950 జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 2011 నుంచి ఏటా ఒక్కో నినాదంతో జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ‘మా ఓటర్లను శక్తివంతం చేయడం, అప్రమత్తంగా, సురక్షితంగా సమాచారం ఇవ్వడం’అనే నినాదాన్ని ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోంది. అలాగే ఈసీఐ వెబ్ రేడియోనూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించి, ‘హలో ఓటర్’కార్యక్రమాన్ని ఆవిష్కరించనున్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున ప్రతీ ఏటా బూత్‌స్థాయిలో, ఆన్‌లైన్‌లో కొత్త ఓటర్ల నమోదు కోసం దరఖాస్తులను స్వీకరిస్తారు. అంతేకాదు కొత్తగా పేర్లు నమోదయిన యువతీయువకులను, ఉత్తమ అధికారులను ఈ రోజున ఘనంగా సన్మానిస్తారు. దొంగ ఓట్లను నివారించాలన్న లక్ష్యంతో భారత ఎన్నికల కమిషన్ ఓటుకు ఆధార్‌ను అనుసంధానం చేసింది. దాదాపు నూరుశాతం ఓటర్లు ఆధార్‌కార్డులతో అనుసంధానమయ్యాయి. కాగా, జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా భారత ఎన్నికల కమిషన్‌ ఎపిక్‌ (ఎలక్ట్రానిక్‌ ఫోటో ఐడెంటిటీ) కార్డులను మొబైల్‌ ఫోన్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనుంది. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలన్న లక్ష్యంగా ప్రతి ఏటా ఓటర్ల నమోదు జాబితా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఇప్పటి వరకు ఓటర్లు తమ ఐడెంటిటీ కార్డు కోసం మీ-సేవను ఆశ్రయించాల్సి వచ్చేది. తాజాగా స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఓటర్లు తమ ఓటర్‌ ఐడెంటీ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 2021 సమ్మర్‌ రివిజన్‌లో కొత్తగా నమోదైన ఓటర్లు ముందుగా తమ ఓటరు ఐడెంటిటీ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశవం కల్పించారు. ఈ మేరకు యువ ఓటర్లు జాతీయ ఓటర్‌ దినోత్సవమైన 25 నుంచి 31 వరకు రిజిస్టర్‌ అయిన మొబైల్‌ ఫోన్‌ నుంచి ఓటరు ఐడెంటిటీ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఓటు నమోదు, మార్పులు, చేర్పులకు... కొత్తగా ఓటు హక్కుకోసం దరఖాస్తు చేసుకునేందుకు ఫారం-6ను పూర్తిచేసి సంబంధిత అధికారికి అందజేయాలి. జాబితాలో ఉన్న పేర్లలో అభ్యంతరాలను తెలిపేందుకు ఫారం 7ను వినియోగించాలి. ఓటరు గుర్తింపు కార్డులో చిరునామా, పేరు, ఫొటో మార్పు లాంటి వాటికి ఫారం 8, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఓటరు కార్డును బదిలీకి ఫారం 8ఏ ఉపయోగపడుతుంది. ఓటుహక్కును ఆన్‌లైన్‌లోనూ పొందేందుకు వీలుగా https://voterportal.eci.gov.in/ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి ఓటుహక్కుకోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


By January 25, 2021 at 11:02AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/history-theme-of-the-year-and-slogans-for-national-voters-day/articleshow/80443873.cms

No comments