Breaking News

‘మీది మీరు తినండి.. మాది మేం తింటాం’ మంత్రులతో లంచ్‌కి నిరాకరించిన రైతులు


కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ విషయంలో కేంద్రం మెట్టు దిగిరాకపోగా.. రైతులు కూడా పట్టువీడటం లేదు. కేంద్రం, రైతు సంఘాల మధ్య సోమవారం ఏడోసారి జరిగిన చర్చలు విఫలమయ్యాయి. వ్యవసాయ రంగానికి ఈ కొత్త సంస్కరణలు ఎంతో మేలు చేస్తాయని, ఉపయోగాలను మంత్రుల బృందం ఏకరవు పెట్టింది. అయినా సరే వివాదాస్పద చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు భీష్మించుకు కూర్చున్నారు. రెండు పక్షాలూ తమ వైఖరికే కట్టుబడి ఉండడంతో చర్చల్లో ఎటువంటి పురోగతి కనిపించలేదు. ఇదిలా ఉండగా చర్చల సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తమతో భోజనం చేయాలని కేంద్ర మంత్రులు చేసిన ప్రతిపాదనను రైతులు తిరస్కరించారు. ‘మీది మీరు తినండి.. మాది మేం తింటాం’ అని స్పష్టం చేశారు. విజ్ఞ‌ాన్ భవన్‌లో జరిగిన చర్చల సందర్భంగా అధికారులు అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో కొందరు రైతులు కుర్చీలపై కూర్చొని (మరికొందరు అదే హాల్‌లో చతికిలబడి కూర్చున్నారు) మంత్రులో కాకుండా విడిగా కూర్చున్నారు. గతవారం జరిగిన చర్చల్లో ఇరు వర్గాలు కలిసి డిన్నర్ చేశాయి. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌లు రైతు సంఘాల నేతలను ఆహ్వానించి, స్వయంగా వారికి వడ్డించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి. రైతుల ప్రధాన డిమాండ్లు వ్యవసాయ చట్టాల రద్దు, ఎంఎస్పికి చట్టపరమైన హామీపై ఇరు పక్షాల మధ్య చర్చలలో పురోగతి కనిపించినట్టేనని భావించారు. ప్రధాన సమస్యలపై ఇరుపక్షాలు అంగీకారానికి రాకపోయినా.. పరిస్థితి మెరుగుపడిందని అనుకున్నారు. కానీ, సోమవారం చర్చల్లో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. చట్టాలను వెనక్కి తీసుకునే దాకా వెనక్కి వెళ్లేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికైత్ తెలిపారు. మూడు చట్టాల రద్దుపై తప్ప మరే ఇతర అంశంపైనా తాము చర్చలకు సిద్ధంగా లేమన్నారు. ఆ చట్టాలను రద్దు చేసేదాకా ఆందోళనల నుంచి వెనక్కి తగ్గేది లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం మరోసారి అంతర్గతంగా చర్చించి రావాలని రైతు సంఘాలు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి 8న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.


By January 05, 2021 at 09:26AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/farmers-refuse-lunch-with-union-ministers-during-7th-round-talks-on-farm-laws/articleshow/80108384.cms

No comments