Breaking News

భారత్-చైనా సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన.. అదొక్కటే కొంత సానుకూలం


గతేడాది మే మొదటి వారం నుంచి తూర్పు సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల అధికారులు పలుసార్లు సమావేశమై చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో కఠినమైన శీతాకాలం కారణంగా తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న కీలక ప్రాంతాల నుంచి భారత్, చైనా తమ దళాలను క్రమంగా వెనక్కుమళ్లించాయి. కానీ, వ్యూహాత్మక ప్రాంతాల్లో మాత్రం ఇరు దేశాలూ తమ సేనలను ఉపసంహరించలేదు. ‘వాస్తవాధీన రేఖ వెంబడి 150 నుంచి 200 కిలోమీటర్ల పరిధిలోని సంప్రదాయ శిక్షణా ప్రాంతాల నుంచి చైనా 10 వేల మంది సైనికులను వెనక్కు తరలించింది.. భారత్ కూడా దీనిని అనుసరించి వివాదాస్పద ప్రాంతాల నుంచి సైన్యాన్ని రప్పించింది’అని రక్షణ శాఖ వర్గాలు సోమవారం వెల్లడించాయి. కానీ, ఉష్ణోగ్రతలు మైనస్ 30 డిగ్రీలకు పడిపోయి, గాలిలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయినా పాంగాంగ్ సరస్సు, చూషుల్, గోగ్రా హాట్‌స్ప్రింగ్స్, దెప్సాంగ్ మైదానాలలో మాత్రం పరిస్థితి ఎప్పటిలాగే ఉంది. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియాలు సోమవారం తూర్పు లడఖ్‌లో పర్యటించి, యుద్ధ సన్నద్ధతపై సమీక్షించారు. ఇదే సమయంలో ఎల్ఏసీ దాటి భారత భూభాగంలోకి చొరబడిన చైనా సైనికుడిని సైన్యం అప్పగించింది. ఫ్రంట్‌లైన్స్, కీలక ప్రాంతాలలో దళాల మోహరింపు కొనసాగుతోంది.. కానీ చలి వాతావరణంలోనూ కార్యాచరణ సామర్థ్యాన్ని కొనసాగించడానికి ఇరుపక్షాలు సన్నద్ధంగా ఉన్నాయని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. బా ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో తొమ్మిది నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతుండగా.. ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడంలేదు. భారత్, చైనాలు 50వేల మంది చొప్పున సైన్యాలను, యుద్ధ ట్యాంకులను, హౌట్జర్స్, ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణులను మోహరించారు. గతేడాది జూన్ 15 గాల్వాన్ లోయ ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ ఘటనలో తన సైనికులు ఎంతమంది చనిపోయారనేది చైనా స్పష్టం చేయలేదు.


By January 12, 2021 at 08:52AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/confrontation-in-eastern-ladakh-continues-india-and-china-reduce-some-troops-in-depth-areas/articleshow/80225203.cms

No comments